నిఘా నేత్రం
నిఘా నేత్రం
Published Sun, Aug 28 2016 9:37 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
జేఎన్‌టీయూకేలో సీసీ కెమెరాల పటిష్ట నిర్వహణ ∙
బయోమెట్రిక్ ఏర్పాటుకు కసరత్తులు
విద్యాలయాల్లో ర్యాగింగ్ వికృత క్రీడకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ను పటిష్టంగా అమలు చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జీఓ జారీ చేసింది.
బాలాజీచెరువు (కాకినాడ) :
ర్యాగింగ్ భూతాన్ని విద్యాలయాలనుంచి తరిమికొట్టే సత్సంకల్పంతో ఏపీ ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది జేఎన్‌టీయూ కాకినాడలో వర్సిటీ ఆవరణ, వివిధ విభాగాలు, వసతి గృహాల్లో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మరింత విస్తృతం చేసి విద్యార్థుల కదలికలపై నిఘా మరింత పెడుతున్నారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటీటీ కార్డులను మంజూరు చేయాలంటూ ఉన్నత విద్యామండలి వర్సిటీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో కళాశాలలో చదువు పూర్తయిన విద్యార్థులు ఏళ్ల తరబడి కళాశాలలో తిష్టవేసేవారు. ర్యాగింగ్‌కు కొందరు పాల్పడేవారు. ఇప్పుడు చేపట్టిన చర్యలతో అలాంటివారి ఆటలు సాగవు. ర్యాగింగ్‌కు ఎవరైనా పాల్పడితే సర్వర్ రి మోట్ సిస్టంలో విద్యార్థి ఆధారాలతో సహా పట్టుబడతాడు. అప్పుడు ర్యాగింగ్ కేసుల నమోదు, రౌడీషీట్ వంటి కేసులు సైతం ప్రత్యేక పరిస్థితుల్లో నమోదవుతాయి. అలా జరిగితే ఆ విద్యార్థి భవిష్యత్‌కు తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకే విద్యార్థులు వాటికి దూరంగా ఉంటారు.
వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం వర్సిటీలో 1,500 మందికి పైగా విద్యార్థులు బీటెక్, ఎంటెక్ చదువుతున్నారు. వసతి గృహాల్లోనే ర్యాగింగ్‌కు అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిపైనే ప్రత్యేక దృష్టి సాధించారు. సీనియర్లను జూనియర్లు సార్, మేడమ్ అంటూ సంబోధించడం, సీనియర్లకు ప్లేటులో అన్నం పెట్టించుకుని జూనియర్లు అందించడం, అనధికారికంగా హాస్టల్‌లో బస చేయడం వంటివి ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వసతి గృహం, ఇతర విభాగాల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరికరాలు త్వరలో రానున్నాయి. అప్పుడు విద్యార్థుల హాజరు కఠినతరం చేయడం, విద్యార్థులు తరగతి, వసతి గృహంలో ఉన్న సమయం, బయటకు వెళ్లే సమయం నమోదవుతుంది. దాంతో దురాగతాలకు చెక్ పడుతుంది.
రాత్రివేళలో ప్రత్యేక నిఘా
రాత్రులు సైతం వర్సిటీలో నిఘా పెట్టాం. రాత్రి 9 గంటల తరువాత నిఘా బృందాలు వర్సిటీలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటులో మిగిలిన వర్సిటీలతో పోలిస్తే ముందున్నాం. ఇప్పటికే వర్సిటీలోకి ప్రధానరహదారిన వచ్చే వాహనాల నెంబర్లను సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
– వెల్లంకి సాంబశివకుమార్, వైస్ చాన్సలర్, జేఎన్‌టీయూకే
Advertisement
Advertisement