
సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలకు జిల్లా మంత్రి హరీశ్‌రావు జాతీయ జెండా ఎగురవేశారు.
- కనులపండువగా పంద్రాగస్టు వేడుకలు
- పరేడ్‌గ్రౌండ్స్‌లో మిన్నంటిన సంబురాలు
- అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు
- ఆకట్టుకున్న శకటాలు
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంగారెడ్డిలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలకు జిల్లా మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి హరీష్‌రావు పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాంస్కృతి ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ రూ.5వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు.
అలరించిన ప్రదర్శనలు
పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. చిట్కుల్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు జాతీయసమైక్యత, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీ ప్రారంభించటం, మిషన్‌కాకతీయ పథకం అమలు, భ్రూణహత్యల నివారణ, బేటీబచావో..బేటీపడావో కార్యక్రమాలను వివరిస్తూ విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి.
సంగారెడ్డికి చెందిన శ్రీచైతన్య హై స్కూల్ విద్యార్థిని కౌశిక భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కేజీవీబీ నర్సాపూర్, సంగారెడ్డి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల, సంగారెడ్డి విద్యాభారతి హైస్కూల్, సెయింట్ ఆంథోనీ హై స్కూల్, పటాన్‌చెరు శిశు విహార్ విద్యార్థుల ప్రదర్శనలను అందరినీ అలరింపజేశాయి.
శకటాల ప్రదర్శన
వివిధ ప్రభుత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉద్యానవనశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా శిశు సంక్షేమం, ఉపాధి హామీ పథకం, అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌బీఎస్‌ఏ, 108,104, ఫైర్ డిపార్టుమెంట్ శకటాలు ప్రదర్శించాయి. ఇదిలా ఉంటే ఐసీడీఎస్, అటవీశాఖల శకటాలపై జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ చిత్రాలను ముద్రించకపోవటం విమర్శలకు దారితీసింది.
స్టాల్స్‌ను తిలకించిన మంత్రి
పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వ శాఖలు తమ పనితీరును వివరిస్తూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. మంత్రి హరీశ్‌రావు స్టాల్స్‌ను తిలకించి అధికారుల పనితీరును అభినందించారు. జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ, డీఆర్‌డీఏ, ఈజీఎస్, ఐసీడీఎస్, ఎస్‌ఎస్‌ఏ, డీఎంహెచ్‌ఓ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎస్సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్, పశుసంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, అటవీశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఆయా స్టాల్స్‌ను మంత్రి హరీష్‌రావు, కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు తిలకించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు కారు తాళాలు అందజేశారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లోని వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.