
కటకటాల్లోకి సెల్ శాడిస్ట్
నల్లమాడకు చెందిన గాజుల రమేశ్ అనే సెల్ శాడిస్ట్‌ను ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
నల్లమాడ : నల్లమాడకు చెందిన గాజుల రమేశ్ అనే సెల్ శాడిస్ట్‌ను ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 250 మందికి పదేపదే ఫోన్లు చేయడం, మిస్డ్ కాల్ ఇవ్వడం, ఎదుటి వారు కాల్ చేయగానే బండబూతులు తిడుతూ కంటికి కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా సుమారు ఎనిమిది నెలలుగా అన్ని వర్గాల వారిని టార్గెట్ చేశాడు. అందులో పరువు కలిగిన వారూ ఉన్నారని నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్‌ఐ గోపీ విలేకరులకు శనివారం తెలిపారు. నిందితుడ్ని మీడియా ఎదుట హాజరుపరిచారు.
నల్లమాడ, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు చెందిన వారికి అతను అధికంగా ఫోన్లు చేసి వేధించినట్లు తేల్చారు. తన పేరున లేని సిమ్‌తో ఏదో ఒక నెంబర్‌కు ఫోన్ చేయడం, గాజులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు ఎక్కడైనా బోర్డుల మీద ఉండే నెంబర్లు సేకరించి కాల్స్ చేస్తూ దూషించడం అతనికి పరిపాటిగా మారిందన్నారు. నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన మహేశ్ అనే బాధితుడు ఈ నెల 10న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో తనను, తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తీగ లాగితే డొంక కదిలింది.
పట్టిచ్చిన కాల్‌డేటా
కాల్‌డేట్, ఐఎంఈ నెంబర్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని సీఐ తెలిపారు. నల్లమాడ క్రాస్ సమీపంలోని ఇండేన్ గ్యాస్ వద్ద శనివారం సిమ్‌కార్డు మారుస్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ తమ సిబ్బందితో వెళ్లి నిందితున్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారన్నారు. నిందితుడి నుంచి సిమ్‌కార్డు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం అతన్ని కదిరి కోర్టుకు తరలించినట్లు వివరించారు. నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ గోపీ, కానిస్టేబుళ్లు ఠాగూర్, రహిమాన్, కరుణాకర్‌రెడ్డి, హోంగార్డులు వనజ, చంద్ర, సుబహాన్‌ను సీఐ అభినందించారు.
శాడిస్ట్ సోదరుడి దుకాణంపై దాడికి యత్నం
నల్లమాడలోని సెల్ శాడిస్ట్ సోదరుడి దుకాణంపై బాధితులు శనివారం దాడికి యత్నించారు. దీంతో అతను వెంటనే ఎస్‌ఐ గోపీని కలసి రక్షణ కోరాడు. ఎస్‌ఐ సహా మాజీ సర్పంచు డీఎస్ కేశవరెడ్డి దుకాణం వద్దకు చేరుకొని బాధితులతో మాట్లాడి, వారిని శాంతింపజేశారు.