అనంతపురం అగ్రికల్చర్ : డ్రోన్ల చిత్రీకరణ మధ్య కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన మంగళవారం ముగిసింది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనా (పీఎంకేఎస్‌వై) కింద చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన కేంద్ర రెవెన్యూశాఖకు చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన సెంట్రల్ టీం రెండో రోజు మంగళవారం పలు మండలాల్లో పర్యటించింది. చిత్తరంజన్‌దాస్, రవికటియార్‌లు రెండో రోజు అధికార బృందంతో కలిసి మంగళవారం అనంతపురం రూరల్ మండలం ఆలమూరులో చెరువును పరిశీలించారు.
తర్వాత రూరల్ మండలం మన్నీలలో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, రెయిన్‌గన్ల పనితీరు గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లిలో ఎన్టీఆర్ జలసిరి, ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ఫారంపాండ్స్, ఎస్సీ ఎస్టీ రైతులు డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద సాగు చేసిన మామిడి తోటలను చూశారు. ఎన్‌ఎస్ కొట్టాల సమీపంలో హంద్రీ–నీవా ప్రాజెక్టు కింద చేపట్టిన టన్నెల్ పనులు పరిశీలించారు. ఆ తర్వాత కదిరి మండలం కేఎన్ పాళ్యంలో వాటర్‌షెడ్ కింద అమలు చేస్తున్న చెక్‌డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులను పరిశీలించారు.
అనంతరం పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువులో నీరు–చెట్టు పనులు, హంద్రీ–నీవా కాలువ పనులు పరిశీలించారు. చివరగా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి హంద్రీ–నీవా ప్రాజెక్టు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన మొత్తం రెండు డ్రోన్లను ఉపయోగించి చిత్రీకరించారు.
ముగిసిన కేంద్ర బృందం పర్యటన
Published Tue, Mar 7 2017 11:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement