Central Drought Team
-
26న కేంద్ర కరువు బృందం జిల్లాకు రాక
కదిరి : జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల బృందం ఈ నెల 26న జిల్లాకు రానున్నట్లు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల వాసులు బెంగుళూరు, కేరళ లాంటి చోట్లకు వలసలు వెళ్లారని, వీటన్నింటిపై ఆ బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు. వలసలను నివారించడం కోసం పని దినాలను 150 రోజులకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత కూడా కల్పించామన్నారు. ఇక ప్రత్యేక హోదాపై మాట్లాడటం దండగ..అన్నారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందనీ, అయితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు వాపసు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇందుకు బా«ధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, నృసింహాలయ కమిటీ సభ్యులు తేపల్లి రామక్రిష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి డీఎల్ ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి జెట్టి ఆంజనేయులు, నాగేంద్ర పాల్గొన్నారు. -
ముగిసిన కేంద్ర బృందం పర్యటన
అనంతపురం అగ్రికల్చర్ : డ్రోన్ల చిత్రీకరణ మధ్య కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన మంగళవారం ముగిసింది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనా (పీఎంకేఎస్‌వై) కింద చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన కేంద్ర రెవెన్యూశాఖకు చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన సెంట్రల్ టీం రెండో రోజు మంగళవారం పలు మండలాల్లో పర్యటించింది. చిత్తరంజన్‌దాస్, రవికటియార్‌లు రెండో రోజు అధికార బృందంతో కలిసి మంగళవారం అనంతపురం రూరల్ మండలం ఆలమూరులో చెరువును పరిశీలించారు. తర్వాత రూరల్ మండలం మన్నీలలో డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, రెయిన్గన్ల పనితీరు గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లిలో ఎన్టీఆర్ జలసిరి, ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ఫారంపాండ్స్, ఎస్సీ ఎస్టీ రైతులు డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద సాగు చేసిన మామిడి తోటలను చూశారు. ఎన్ఎస్ కొట్టాల సమీపంలో హంద్రీ–నీవా ప్రాజెక్టు కింద చేపట్టిన టన్నెల్ పనులు పరిశీలించారు. ఆ తర్వాత కదిరి మండలం కేఎన్ పాళ్యంలో వాటర్‌షెడ్ కింద అమలు చేస్తున్న చెక్‌డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులను పరిశీలించారు. అనంతరం పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువులో నీరు–చెట్టు పనులు, హంద్రీ–నీవా కాలువ పనులు పరిశీలించారు. చివరగా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి హంద్రీ–నీవా ప్రాజెక్టు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన మొత్తం రెండు డ్రోన్లను ఉపయోగించి చిత్రీకరించారు. -
వినతుల ఏ‘కరువు’
- ముగిసిన కరువు బృందం పర్యటన – జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలి - రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల వినతి అనంతపురం అగ్రికల్చర్ : ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పేరిట కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం జిల్లా పర్యటన మంగళవారం ముగిసింది. తొలిరోజు హిందూపురం, పరిగి, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల పరిధిలో పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యింది. అనంతరం కేంద్ర బృందం రెండో రోజు మంగళవారం కేవలం అరగంట పాటు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వినతులు స్వీకరించి, ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లింది. కేంద్రబృందాన్ని కలిసిన రాజకీయ పార్టీలు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉదయం కేంద్ర కరువు బృందం సభ్యులు జేకే రాథోడ్, జీఆర్ జర్గర్, ఎం.రామకృష్ణతో పాటు కలెక్టర్ కోనశశిధర్, జేసీ బి.లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌ను వివిధ రాజకీయ పార్టీల నేతలు కలిసి కరువు నిర్మూలనకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి తదితరులు కలిసి వినతులు అందజేశారు. కరువు పరిస్థితులు ఉన్నందున ‘అనంత’కు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. రూ.3 వేల కోట్లు ఇవ్వాలి : తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో తక్షణం రూ.3 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఐదేళ్ల కాలపరిమితితో శాశ్వత కరువు నివారణకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీ నేతలు సంయుక్తంగా కేంద్ర బృందాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎకరాకు రూ.20 వేల ఇన్పుట్, 300 రోజులు ఉపాధి పనులు, రూ.300 కూలీ చెల్లించడం, హంద్రీ–నీవాను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి నిధులు విడుదల చేయాలని కోరారు. వామపక్ష పార్టీ నాయకులు జి.ఓబులు, వి.రాంభూపాల్, డి.జగదీష్, పెద్దన్న, ఇండ్ల ప్రభాకరరెడ్డి, ఓ నల్లప్ప, బీహెచ్ రాయుడు, జాఫర్ తదితరులు ఉన్నారు. హంద్రీ–నీవా ద్వారా 80 టీఎంసీలు హంద్రీ–నీవా ప్రాజెక్టును తక్షణం పూర్తి చేసి జిల్లాకు 80 టీఎంసీల నీళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, జిల్లా ఇన్చార్జ్ రవిచంద్రారెడ్డి, నాయకులు మాసూలు శ్రీనివాసులు, జీటీ ప్రభాకర్, కేవీ రమణ, కృష్ణ తదితరులు వినతి పత్రం అందజేశారు. 2013, 2015, 2016 ఇన్పుట్ సబ్సిడీ, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లా ప్రజలు, రైతులను ఆదుకోవాలన్నారు. ఫసల్ బీమా వర్తింపజేయాలి వేరుశనగ పంటకు ఫసల్‌బీమా వర్తించేలా సిఫారసు చేయాలని బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. శాశ్వత కరువు నివారణలో భాగంగా నదుల అనుసంధానం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇందులో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరెడ్డి, నాయకులు తలుపుల గంగరాజు, ఎం.శ్రీనివాసులు, జి.లలిత్‌కుమార్, ఓలేటి రత్నమయ్య, పెద్దన్న, దాసరి రామ్మూర్తి, వెంకటనాయుడు తదితరులు ఉన్నారు. రుణాలు మాఫీ చేయాలి ఖరీఫ్–2016లో తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు ఎకరాకు రూ.20 వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖరరెడ్డి, నాయకులు చెన్నారెడ్డి, టి.రామాంజనేయులు, కె.సరస్వతి తదితరులు కేంద్ర బృందానికి వినతి పత్రం అందజేశారు. వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఉచితంగా విత్తనాలు, ఎరువులు : కరువును దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డి.లక్ష్మిదేవి, జిల్లా కార్యదర్శి కె.మల్లేశ్వరి వినతిపత్రం ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని, తాగునీటి సమస్య నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.నూర్‌బాషా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఫణీంద్రనాథరెడ్డి, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, న్యాయవాదుల సంఘం తరఫున వేర్వేరుగా కేంద్ర బృందానికి వినతి పత్రాలు సమర్పించారు. -
రూ.5వేల కోట్లు కేటాయించాలి : వైఎస్సార్సీపీ నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లాకు రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కరువు బృందాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందాన్ని నేతలు కలిసి కరువుతో అల్లాడుతున్న జిల్లాను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో ఉపాధి పనులు పెంచడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర కరువు బృందాన్ని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు. -
ఇబ్రహీంపట్నంలో కరువు బృందం పర్యటన
ఇబ్రహింపట్నం : కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రంగారెడ్డి జిల్లలో పర్యటించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం లో మంగళవారం పర్యటించిన బృందం పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించి కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం గండిపేట చెరువును పరిశీలిస్తారు. చెరువు అలుగు మట్టం వివరాలు, గతంలో పరిస్థితిని అధికారులను అడిగి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మొయినాబాద్ మండలం కేసారం గ్రామంలో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లడతారు. అక్కడి నుంచి పరిగి మండలంలోని పత్తి పంటను, వికారాబాద్ లోని శివసాగర్ చెరువు పరిస్థితిని సమీక్షిస్తారు. -
నిబంధనల ప్రకారమే నడుచుకుంటాం
కరువు బృందం ప్రకటన జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఏర్పడిన కరువును పరిశీలించిన కేంద్ర బృందం నిబంధనల మేరకే నడుచుకుంటామని, ఆ పరిధుల్లోనే ఆదుకుంటామని ప్రకటించింది.కేంద్ర కరువు బృందం సభ్యులు పీఎస్ఎన్ చక్రవర్తి, పీజీఎస్ రావు, గోవర్ధన్‌లాల్‌లు గురువారం పొన్నలూరు, పీసీపల్లి, కనిగిరి, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో పర్యటించారు.ముందుగా పొన్నలూరు మండలంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించారు. ఆయకట్టు వివరాలు, సాగునీరు అందకపోవడానికి కారణాలను, కరవు వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం, తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, చెరువులో నీరు లేకపోవడంతో పశువులకు పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందని, గతంలో గేదెకు పది లీటర్లు పాలు ఇచ్చేవని, పశుగ్రాశం లేక ఇప్పడు మూడు లీటర్లే ఇస్తున్నాయని చెప్పారు. కదిరి మండలం గోపాలపురం రిజర్వాయర్‌ను పరిశీలించారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక రిజర్వాయర్ నిండలేదని స్థానికులు వివరించారు. అనంతరం పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయరును పరిశీలించింది. మోపాడు రిజర్వాయర్‌కు గత నాలుగు సంవత్సరాలుగా నీరు చేరడంలేదని దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు, పనులులేక 30 శాతానిపైగా వలసలు పోయారని బందం సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు విన్నవించారు. గత రెండేళ్లలో వందల ఎకరాల్లో బత్తాయి, నిమ్మతోటలు నిలువునా ఎండిపోయాయని, వేల ఎకరాల మాగాణి, మెట్ట భూములు బీడుభూములుగా మారాయని వెలిగొండ నీరువస్తే తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. కరువును కళ్లారాచూశాం కరువుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర కరువు పరిశీలన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వెలిగండ్ల మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు. -
హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటన
అనంతపురం: హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది. హంద్రీ-నీవాను వెంటనే పూర్తి చేసి, జిల్లాకు నీరందించాలని జిల్లా జలసాధన సమితి ప్రతినిధులు కేంద్ర బృందానికి ఒక వినతి పత్రం అందజేశారు. మోడల్ కాలనీలోని మహిళలతో కేంద్ర బృందం ముఖాముఖి మాట్లాడింది. తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకుంది. ఏడు నియోజకవర్గాలలో కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది.