కదిరి : జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల బృందం ఈ నెల 26న జిల్లాకు రానున్నట్లు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల వాసులు బెంగుళూరు, కేరళ లాంటి చోట్లకు వలసలు వెళ్లారని, వీటన్నింటిపై ఆ బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు. వలసలను నివారించడం కోసం పని దినాలను 150 రోజులకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత కూడా కల్పించామన్నారు. ఇక ప్రత్యేక హోదాపై మాట్లాడటం దండగ..అన్నారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందనీ, అయితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు వాపసు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇందుకు బా«ధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, నృసింహాలయ కమిటీ సభ్యులు తేపల్లి రామక్రిష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి డీఎల్ ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి జెట్టి ఆంజనేయులు, నాగేంద్ర పాల్గొన్నారు.
26న కేంద్ర కరువు బృందం జిల్లాకు రాక
Published Thu, Mar 16 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
Advertisement