
ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు నిధులు
రైల్వే మంత్రితో భేటీ అనంతరం జోగురామన్న, ఇంద్రకరణ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్మూర్– ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైన్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖను మంగళవారం ఢిల్లీలో సురేశ్ ప్రభును ఆయన కార్యాలయంలో కలసి మంత్రులు అందజేశారు. రైల్వే లైన్‌తో నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఇంద్రకరణ్ పేర్కొన్నారు.
రైల్వే లైన్ నిర్మాణ ఖర్చులో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ప్రభు.. వచ్చే బడ్జెట్‌లో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిధుల విడుదలను బట్టి ఈ ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని జోగురామన్న తెలిపారు. భద్రాచలం–కొవ్వూరు, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. సురేశ్ ప్రభును కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తెజోవత్, ఎంపీ జి.నగేశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు.