మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
Published Mon, Apr 3 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ వైస్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్, గుంటూరు జిల్లా మాచెర్ల మున్సిపల్ చైర్మన్, తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్‌తో పాటు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీ మున్సిపల్ యాక్టు 1965 రూల్ 3 ప్రకారం ఎన్నిక ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ నెల 11న ఎన్నికకు నోటీసులు ఇవ్వనున్నారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక ఉంటుందని వివరించారు.
కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన కమిషనర్...
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఎన్నిక నిర్వహణకు సంబంధించి ప్రొసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. జాయింట్ కలెక్టర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసి, 15న మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మార్చి 7న మున్సిపల్ చైర్మన్‌గా ఉండేల గురివిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మార్చి 27న కౌన్సిల్ ఆమోదించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారులు చైర్మన్ రాజీనామాను పంపడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఊహించిన దాని కంటే ముందుగా...
చైర్మన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు కనీసం నెల రోజులు అయినా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే కేవలం 18 రోజుల గడువులోనే విడుదల కావడంతో అందరూ ఉహించిన దాని కంటే ముందుగానే ఎన్నిక జరగనుంది.
Advertisement
Advertisement