అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు
– ఆళ్లగడ్డ లో వైఎస్సార్సీపీకి
పూర్వ వైభవం తెస్తాం-గంగుల
– జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో
వైఎస్సార్‌సీపీలో చేరేందుకు 200 వాహనాల్లో
తరలి వెళ్లిన గంగుల వర్గం
ఆళ్లగడ్డ: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపమని, ఆయన నోటివెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం తన అనుచరులతో హైదరాబాద్‌కు ఆళ్లగడ్డ నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారన్నారు. నమ్ముకున్న నాయకులను నిట్టనిలువున ముంచే స్వభావం బాబుది అని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఆయన మోసాలను భరించానన్నారు. అయితే, కార్యకర్తలకు అన్యాయం చేయలేకే పార్టీ వీడుతున్నామన్నారు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు అధికార పక్షాన్ని వదిలి ధైర్యంగా ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నామన్నారు. వైఎస్‌జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టి నియోజవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.
200 వాహనాలతో బయలుదేరిన గంగుల
ఆళ్లగడ్డ నుంచి గుంగుల ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి సుమారు 200 వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గంగులబిజేంద్రారెడ్డి, గంగుల సుభాస్‌రెడ్డి, చాగలమర్రి మండలం నాయకులు వీరభధ్రుడు, బాబులాల్, నారపురెడ్డి, ఉయ్యలవాడ మండలం నాయకులు గజ్జల కృష్ణారెడ్డి, అరికట్ల శివరామకృష్ణరెడ్డి, నారాయణమ్మ, నరసింహుడు, దొర్నిపాడు మండల నాయకులు నాగేశ్వరరావు, బాలవెంకటరెడ్డి, శేఖర్, వెంట్రామిరెడ్డి, రుద్రవరం మండల నాయకులు తిమ్మయ్య, బాచిపల్లె నారాయణ, నర్సిరెడ్డి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, శిరివెళ్ల మండల నాయకులు నాగన్న, కృష్ణారెడ్డి, ఓబులకొండారెడ్డి, చిన్నగుర్రెడ్డి, ఆళ్లగడ్డ మండల నాయకులు బండిచంద్రుడు, శివనాగిరెడ్డి, జాఫర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, నాసారివెంకటేశ్వర్లు తోపాటు 35 మంది ఎంపీటీసీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు కౌన్సిలర్లు గంగుల వెంట వెళ్లారు.