పనితీరు మార్చుకోండి
Published Wed, Oct 26 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
- సీసీఎస్ పోలీసులపై ఎస్పీ ఆకె రవికృష్ణ ఆగ్రహం
కర్నూలు: ‘సీసీఎస్ అంటే పునరావాస కేంద్రం కాదు... మీ పనితీరు బాగా లేదు... అనుకున్న ఫలితాలు సాధించడం లేదు.. ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో నాకు తెలియాలి. కొంతమంది విధులకే రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా అయితే శాఖాపరమైన చర్యలు తప్పవు’ అని ఎస్పీ ఆకె రవికృష్ణ సీసీఎస్ సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన నేర పరిశోధన విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాపర్టీ, డెకాయిటీ, సైబర్ నేరాలను విభజించి వాటికి బాధ్యులుగా నియమించుకొని ఫలితాలను సాధించాలని ఆదేశించారు.
చురుగ్గా పనిచేస్తూ దొంగతనాలను అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులు, సై»బర్ నేరాలు, వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను, స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేరగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచి చోరీలను అరికట్టాలని సూచించారు. నేరాల వారీగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, టాస్క్‌లను ఏర్పాటు చేసుకొని వాటిని ఛేదించాలని సూచించారు. సీసీఎస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంచి నేరాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సై»బర్ నేరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన ఛేదించాలన్నారు. ఈ వివరాలను వారానికోసారి నివేదిక రూపంలో డీఎస్పీకి అందించాలన్నారు. నెలకోసారి సీసీఎస్‌ను తనిఖీ చేస్తానని హెచ్చరించారు. సీఐలు సురేంద్రబాబు, లక్ష్మయ్య, చక్రవర్తి, శ్రీనివాసులు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో సమావేశమై నేరాలపై చర్చించారు. విధి నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement