ప్రేమ పేరుతో వంచన
ప్రేమ పేరుతో వంచన
Published Thu, Nov 3 2016 9:09 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– ఎంబీఏ విద్యార్థినిని మోసం చేసిన మాజీ పోలీసు కుమారుడు
– నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో వేధింపులు
– సైబర్ నేరం కింద నిందితుడి అరెస్టు
కర్నూలు: ప్రేమ పేరుతో ఎంబీఏ విద్యార్థినిని నమ్మించి మొహం చాటేసిన ఓ మాజీ పోలీసు కుమారుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆకే రవికృష్ణ కేసు వివరాలను వీడియాకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఓ యువతి కర్నూలు శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఏపీఎస్‌పీ రెండో పటాలంలో పని చేస్తూ పదవీవిరమణ పొందిన పోలీసు కుమారుడు మొర్రి శివకుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఇద్దరూ కలిసి కొద్ది రోజులు తిరిగారు. కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అప్పటి నుంచి నిందితుడు అమ్మాయిని మానసికంగా వేధిస్తూ అత్యంత హేయమైన మాటలతో ఫోన్‌లో దుర్భాషలాడేవాడు. అక్టోబరు 9వ తేదీ నుంచి ఆమె పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇరువురు కలిసి తిరిగిన ఫొటోలతో పాటు, అభ్యంతకరమైన ఫొటోలను, మెసేజ్‌లను ఫేస్‌బుక్‌లో పెట్టి భయబ్రాంతులకు గురి చేశాడు. ఆమె చెల్లెలు, స్నేహితురాళ్లు, బంధువులకు, సోషల్ మీడియాలో పంపించి కుటుంబ సభ్యులకు ఫోన్‌కాల్ చేసి దుర్భాషలాడినందుకు బాధితురాలు ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తును సీసీఎస్ పోలీసులకు అప్పగించడంతో డీఎస్పీ ఉసేన్‌పీరా పర్యవేక్షణలో సీఐ లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్ ఆదికేశవరాజు, కానిస్టేబుళ్లు రాఘవేంద్రప్రసాద్, శివరాజు తదితరులు నిందితునిపై నిఘా వేసి అదుపులోకి తీసుకున్నారు. సైబర్ పీఎస్‌కు తెలియజేసి ఫేస్‌బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. సైబర్ నేరాలను చేధించి నిందితున్ని అరెస్టు చేసినందుకు డీఎస్పీ ఉసేన్‌పీరా, సీఐ లక్ష్మయ్యతో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
సైబర్ నేరాల పరిష్కారానికి ప్రత్యేక విభాగం: ఎస్పీ
సైబర్ నేరాల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఇన్స్‌పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. చదువుకుంటున్న అమ్మాయిలు సైబర్ నేరాలకు గురైతే సీసీఎస్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్, సోషల్‌మీడియాలో వేధింపులు, హింసకు గురైతే నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్, సీసీఎస్, ఎస్పీ కార్యాలయంలో కలిసి నేరుగా తమ సమస్యలను చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు శ్రద్ధగా చదువుతున్నారా, లేదా గమనిస్తుండాలి. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తుంటారు. ప్రేమ పేరుతో వంచనకు గురై జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ముందు కెరియర్ గురించి ఆలోచించుకోవాలి.
Advertisement
Advertisement