రేనాటి ఖ్యాతిని ప్రపంచానికి చాటుదాం
రేనాటి ఖ్యాతిని ప్రపంచానికి చాటుదాం
Published Thu, May 11 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
- కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి పిలుపు
- చెన్నై నుంచి ఉయ్యాలవాడ చేరిన స్మారకయాత్ర
ఉయ్యాలవాడ: రేనాటి సూర్య చంద్రులుగా ఖ్యాతి గడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు భాష పరిరక్షణ కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి అన్నారు. చెన్నై నుంచి ప్రారంభించిన చరిత్రాత్మక స్మారకయాత్ర గురువారం ఉయ్యాలవాడ చేరింది. ఈ సందర్భంగా స్థానిక బస్డాండు ఆవరణలోని వీరనరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారి కుటుంబీకులు బుడ్డా ఈశ్వరరెడ్డి, బుడ్డా విశ్వనాథరెడ్డి, దొరవారి సాంబశివారెడ్డి, శివశంకర్‌రెడ్డి, బొజ్జారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో తెల్లదొరలపై పోరాడిన మొట్టమొదటి వీరున్ని స్మరించుకునేందుకే వచ్చినట్లు తెలిపారు.
ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు దక్కిన గౌరవం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి దక్కకపోవడం బాధాకరమన్నారు. ఆయన జీవిత చరిత్రను భావి భారత యువకులకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. భారత రాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని అమరావతి, జిల్లా కేంద్రాల్లో వీరి విగ్రహాలను నెలకొల్పేలా పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. వీరి వీరత్వం, దాతృత్వం దేశ రాజధాని ఢిల్లీ వరకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉయ్యాలవాడ చరిత్ర, నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కేంద్రప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. ఎందరో దర్శకులు నరసింహారెడ్డి చరిత్రను సినిమా రూపంలో తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చినా ఆ కళ ఇప్పటికి చిరంజీవి రూపంలో వస్తుండడం అదృష్టమన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కేడీసీసీ మాజీ చైర్మన్ గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, గ్రామ నాయకులు ఖాతా దస్తగిరిరెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.
Advertisement