కడప సెవెన్‌రోడ్స్ : భారతీయుల్లో జాతీయ భా వం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నేటికి సరిగ్గా 176 ఏళ్ల క్రితం ఉరికొయ్యను ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా, దిక్చూచిగా నిలిచారు.
తిరుగుబాటులో ముఖ్య సంఘటనలు
1846 జూన్‌లో తనకు రావాల్సిన పెన్షన్ కోసం అనుచరులను కోయిలకుంట్ల ట్రెజరీకి పంపగా తహసీల్దార్ రాఘవాచార్యులు తిట్టి పంపడంతో పోరాటానికి తెర లేచింది. జూలై 7 లేదా 8 తేదీల్లో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రా మాన్ని కొల్లగొట్టుకుపోతుండగా మిట్టపల్లె వద్ద పోలీసులతో పోరాటం జరిగింది. జూలై 10న కోయిలకుంట్ల ట్రెజరీపై రెడ్డి బృందం దాడి జరిపింది. జూలై 23న గిద్దలూరు వద్ద లెఫ్ట్‌నెంట్ వాట్సన్, 24న ముండ్లపాడు వద్ద కెపె్టన్ నాట్, కెప్టెన్ రసల్ నాయకత్వంలోని సైన్యంతో పోరాటం సాగింది. అక్టోబరు 6న పేరుసోముల కొండల్లో పట్టుబడ్డారు. 1847 ఫిబ్రవరి 22న సో మవారం ఉదయం 7 గంటలకు కోయిలకుంట్లలో 2000 మంది ప్రజలు చూస్తుండగా కడప కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో నరసింహారెడ్డిని ఉరి తీశారు. 1877 వరకు ఆయన తల ఉరి కంభానికి వేలాడుతూనే ఉంచారు.
‘సీమ’ రైతాంగ పోరాటం
నరసింహారెడ్డి తన పెన్షన్ కోసం తిరుగుబాటు చేశారే తప్ప బ్రిటీషు పాలకులను వెళ్లగొట్టాలన్న లక్ష్యంతో కాదని ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో కొందరు వాదించడంలో నిజం లేదని జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. పెన్షన్ కోసమే అయితే సుమారు 9 వేల మంది ప్రజలు తిరుగుబాటులో ఎందుకు పాలుపంచుకున్నారన్న ప్రశ్నకు విమర్శకుల వద్ద సమాధానం లేదు. కరువులు వచ్చి పంటలు పండకపోయినా భూమి శిస్తు వసూలు చేసేవారు. పైగా శిస్తుల భారం అధికంగా ఉండటంతో అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల భూములను రైతులు బీళ్లుగా పెట్టాల్సి వచ్చింది. గ్రామ కట్టుబడి బంట్రోతులు అనుభవించుకుంటున్న మాన్యం భూముల వంశపారంపర్య హక్కులు ప్రభుత్వం రద్దు చేసింది. సంతతి లేకుండా మరణించిన కట్టుబడుల భూములను లాగేసుకున్నారు. గ్రామ విధులను సరిగా నిర్వర్తించలేదని కొందరి తవర్జీ తగ్గించారు. బంట్రోతులను బదిలీ చేయడం, గ్రామ పోలీసు వ్యవస్థ పునర్ నిర్మాణానికి ప్రయత్నించారు. ఇవన్నీ కట్టుబడులలో అలజడి కలిగించడంతో నరసింహారెడ్డి వెంట నడిచారు. ఈ కేసు విచారణ చేసిన స్పెషల్ కమిషనర్ ఇంగ్లిస్ స్వయంగా ఈ వివరాలను బోర్డు ఆఫ్ రెవెన్యూకు నివేదించారు. ఈ కారణాల రీత్యా దీన్ని రాయలసీమ రైతాంగం జరిపిన తొలి తిరుగుబాటుగా భావించాలని చరిత్రకారులు అంటున్నారు.
నరసింహారెడ్డి అందరివాడు
జాతీయ నాయకుల మాదిరే నరసింహారెడ్డిని కూడా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి మాట్లాడే ధోరణి సరికాదని మేధావుల అభిప్రాయం. నరసింహారెడ్డి గురువుగా భావించే గోసాయి వెంకయ్య ప్రధాన అనుచరులైన కరణం అశ్వర్థామ, జంగం మల్లయ్య, వడ్డె ఓబన్నలతోపాటు చెంచులు, యానాదులు, బోయలు, వడ్డెరలు తిరుగుబాటులో ప్రధానంగా పాల్గొన్నారు. చివరకు బ్రాహ్మణులు సైతం పాల్గొన్నారంటే ఆ తిరుగుబాటుకు ఉన్న ప్రజా పునాది అర్థమవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు.
చరిత్రకారుల చిన్నచూపు
సిపాయిల, సన్యాసుల, మోప్లా, చిట్టగాంగ్, రంపా, చీరాల–పేరాల తిరుగుబాట్ల గురించి నాటి చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ వాటి కంటే ఎన్నో ఏళ్ల ముందు స్వరూపంలో ఏమాత్రం తీసిపోని నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి పట్టించుకోలేదని అంటున్నారు. 1955లో బెంగాలి చరిత్రకారుడు ఎస్‌బీ చౌదరి మాత్రమే తాను రాసిన ‘సివిల్ డిస్ట్రబెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటీషు రూల్ ఇన్ ఇండియా (1765–1857)’ అనే గ్రంథంలో నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్ర చరిత్రకారులు కనీసం తిరుగుబాటుకు సంబంధించిన కాలక్రమణికను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
నేడు వర్ధంతి సభ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభను బుధవారం ఉదయం కడప నగరంలోని రెడ్డి సేవా సమితి కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా హైసూ్కలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– లెక్కల కొండారెడ్డి, రెడ్డి సేవా సమితి, కడప
నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం నరసింహారెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించడం, కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టడం అభినందనీయం. భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలి.
– కేశవులు నాయుడు,
పాలెగార్ వంశీయులు, మాదినేనిపాలెం, గుర్రంకొండ
Comments
Please login to add a commentAdd a comment