1978లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రంవిపక్షంలో ఉన్నా.. అధికారం చేపట్టినా ప్రజల కోసమే పోరాడిన యోధుడుమూడు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని ధీరుడుపులివెందుల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికకడప లోక్‌సభ స్థానం నుంచి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం
సాక్షి, అమరావతి: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుల్లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందువరుసలో నిలుస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడే ధీశాలికి జనం వెన్నంటి నిలిచి అజేయుడిని చేశారు.
మదిలో పదిలం.. ఎన్నటికీ మరువలేం: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ దంపతులకు 1949, జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కర్ణాటకలో గుల్బార్గాలోని ఎమ్మార్ వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు. పులివెందులలో 1973లో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో 70 పడకల ఆస్పత్రిని ప్రారంభించి.. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేశారు. రూపాయికే వైద్యం చేస్తూ ప్రజలకు చేరువయ్యారు.
తక్కువ సమయంలోనే రూపాయి డాక్టర్‌గా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. శాసనసభకు ఎన్నికైన తొలి సారే అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని 1980 నుంచి 83 వరకూ గ్రామీణాభివృద్ధి, విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు.
ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ..
సినీనటుడు ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసి.. టీడీపీని స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ పులివెందుల శాసనసభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టారు.
వైఎస్‌తోపాటు 1978లో చంద్రగిరి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌పైనే పోటీచేసి విజయం సాధిస్తానని బీరాలు పలికారు. కానీ.. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ గాలిలో కొట్టుకుపోయి టీడీపీ పంచన చేరి.. 1985 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పానికి వలస వెళ్లడం గమనార్హం.
వైరిపక్షాలు ఏకమైనా..
రాజీవ్‌గాంధీ సూచన మేరకు 1989 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. 1.66 లక్షల మెజార్టీతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి 4.18 లక్షల రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించారు.
ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. 1996 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఓడించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడి.. కాంగ్రెస్‌లో వైఎస్ వైరిపక్షాలతో బాబు కుట్రలు చేశారు. కానీ.. ఆ కుట్రలను చిత్తు చేసి విజయకేతనం ఎగురవేసి, ఎంపీగానూ హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లోనూ కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు.
డబుల్ హ్యాట్రిక్
పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి రెండోసారి హ్యాట్రిక్ సాధించారు.
జనం మెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉభయ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణించి 14 ఏళ్లు గడిచినా ఆయన పాలనను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే.. ఆయన ఎంత ప్రజారంజకంగా పాలించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఓట్ల రాజకీయాలకు వైఎస్సార్ స్వస్తి చెప్పారు. ఎన్నికల్లోనే రాజకీయాలు తప్ప.. తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండేవారు. ఓటు వేయని వారితోపాటు ప్రజలందరికీ ముఖ్యమంత్రిననే రీతిలో వైఎస్సార్ పాలన సాగించారు. అర్హులైన వారందరికీ పథకాలను సంతృప్త స్థాయిలో అందించారు. ఇతర పార్టీల వారికి పథకాలు ఇస్తున్నారని స్వపక్ష ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా.. ప్రజలందరికీ ముఖ్యమంత్రిని గానీ కొందరికే కాదనే సమాధానం వైఎస్సార్ నుంచి వచ్చేది.
– రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీవీకే భాను
భవిష్యత్ తరాల మేలు కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన అరుదైన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఆయన దార్శనికతకు నిదర్శనం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పెంచి రాయలసీమ గొంతు తడిపింది కూడా దివంగత మహానేతే. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి సాయం చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్‌కు ఎవరూ సాటిరారు. తారతమ్యాలు లేకుండా ఎవరికైనా సాయమందించేవారు. – విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment