పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత.. జనం గుండెల్లో చెరగని ముద్ర | The man of public who won the hearts, YS Raja Reddy | Sakshi
Sakshi News home page

పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత.. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

Published Tue, May 23 2023 1:35 AM | Last Updated on Tue, May 23 2023 5:17 PM

- - Sakshi

పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేద ప్రజలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలిచేవారు. కరువు లాంటి విపత్కర పరిస్థితులలోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్‌ రాజారెడ్డి. వైఎస్‌ రాజారెడ్డి 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు.

ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరినీ ఏకతాటిపై నడిపించిన వైఎస్‌ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్‌గా ఆయన ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది.

పులివెందుల గ్రామ సర్పంచ్‌గా..
రాజకీయాల్లోకి రాకమునుపు నుంచి పులివెందుల్లో వై.ఎస్‌.రాజారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ఈ నాటికీ ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది.

► ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచుగా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్‌గా 1988 నుండి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు చెరువులను తవ్వించారు. పులివెందుల్లో అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు.

అలనాడు సర్పంచ్‌గా పనిచేస్తున్న సమయంలో పులివెందుల్లో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. గ్రామ ప్రజలకు సమస్యలు రాకుండా పోరాడుతూనే మరోవైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు.

► తన కుమారుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ ఉన్నతికి ఆయన ఎంతో కృషి, తోడ్పాటు అందించారు. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా వైఎస్‌ రాజారెడ్డి పేరుతో కాలనీలు కూడా వెలిశాయి.

పులివెందుల ప్రజల మనసులో ప్రత్యేక స్థానం
పులివెందుల పరిధిలో దివంగత వైఎస్‌ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు ప్రజల మనసులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్‌ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారు. వైఎస్‌ఆర్‌ రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్‌ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవారు. దీంతో వైఎస్‌ఆర్‌ రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించగలిగారు. వైఎస్‌ రాజారెడ్డి తనయుడు వైఎస్‌ఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవారు.

విద్యా ప్రదాతగా..
వైఎస్‌ రాజారెడ్డి పులివెందుల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలు నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవారు. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్సార్‌ చూపిన బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజలు ఈ నాటికీ పులివెందుల పెద్దాయన వైఎస్‌ రాజారెడ్డిని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

ఘన నివాళులర్పించిన వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మ
దివంగత వైఎస్‌ రాజారెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధుల తోటలో గల వైఎస్‌ జయమ్మ, వైఎస్‌ రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్‌ కుటుంబీకులు, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ రాజారెడ్డి పార్కులోని వైఎస్‌ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. జీసెస్‌ చారిటీస్‌లో గల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement