రేషన్ డీలర్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
దేవర పల్లి : రేషన్ డీలర్లు ఈ నెల 21 నుంచి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు డీలర్ల సంఘం నేతలను హెచ్చరించారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవనంలో కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ వివరాలను వెంకటేష్ గౌడ్ ఫోన్‌లో స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ పాస్ విధానం వల్ల జీవనోపాధి కోల్పోయామని, డీలర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లను ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ డీలర్ల సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని, బంద్‌లు, ధర్నాలు వంటివి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు. అయితే డీలర్లు కాని వ్యక్తులు రాష్ట్రంలో నాయకులుగా చెప్పుకొంటూ డీలర్లను తప్పుదారి పట్టిస్తున్నారని, సమ్మె ప్రకటనకు సంఘానికి సంబంధం లేదని సీఎం చంద్రబాబుకు తాము వివరించినట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు.
చంద్రన్న కానుకలు, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి ప్రభుత్వానికి సహకరిస్తామని ముఖ్యమంత్రికి హమీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి గిరి రాజా, కోశాధికారి టీఏవీవీఎల్ నరసింహమూర్తి, నాయకులు యు. అప్పలరాజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారన్నారు.
వెల్లడించిన డీలర్ల సంఘం రాష్ర్ట నేతలు
సమ్మె చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
Published Sun, Dec 20 2015 2:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM
Advertisement