అమ్మకు ప్రేమతో!
కడుపు పండిందని మురిసిపోయావు..
పిండమై ఎదుగుతుంటే కలల్లో తేలిపోయావు..
నెలలు నిండుతుంటే వెలిగిపోయావు..
నా కదలిక నీకు ఆట వస్తువు..
లోకానికి పరిచయం చేయాలని తపించిపోయావు..
తీరా జన్మనిచ్చి ఎందుకిలా చేశావు..
ఆడ..పిల్లననా? నీదీ ఆడ జన్మే కదా!
నాన్నకు నేను కానిదానినయ్యానా..
అత్తారింట్లో నన్ను చీదరించుకున్నారా..
నా పుట్టుకే భారమనుకున్నారా..
నవ మాసాలు మోసింది చెత్తకుప్ప పాలు చేసేందుకేనా..
నా ఏడుపు మనసు కరిగించలేకపోయిందా..
నీ పొత్తిళ్లలో సేదతీరాలనే కోరిక ఇక తీరనట్లేనా..
నీ ప్రేమామృతానికి నేను నోచుకోనా..
అమ్మా.. ఆలోచించు
నీ రుణం తీర్చుకునే భాగ్యం కల్పించు.
అనంతపురం న్యూసిటీ : అప్పుడే నగరం కళ్లు తెరుస్తోంది. ఉదయం 7 గంటల సమయంలో సాయినగర్ మూడవ క్రాస్ వద్దనున్న చెత్తకుండీ వద్ద ఓ పసికందు ఏడుపు అటువైపుగా వెళ్తున్న వారి చెవిన పడింది. వెళ్లి చూస్తే.. చిన్న బ్యాగులో పసికందు కనిపించింది. సమీపంలో టీకొట్టు నిర్వహిస్తున్న మహిళ ఆ బిడ్డను తన ఒదిలోకి తీసుకుంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు ఎస్‌ఎన్‌సీయూకు రెఫర్ చేశారు.
డాక్టర్ కళావతి ప్రీ మెచ్యూర్డ్ బేబీగా గుర్తించారు. పాప జన్మించి 24 గంటలు అయి ఉంటుందని.. బరువు 1.6 కేజీలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాప ఆయాసంతో ఇబ్బంది పడుతోందని.. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సాయినగర్‌లో ప్రయివేట్ ఆసుపత్రులు అధికంగా ఉండటంతో.. అప్పుడే డెలివరీ అయిన పాపను ఇష్టం లేక వదిలేసి వెళ్లినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల తీరు పట్ల స్థానికంగా అసహనం వ్యక్తమవుతోంది.