బాల కార్మికులకు విముక్తి
కావలిఅర్బన్:
నెల్లూరు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆదివారం కావలి మండలంలోని రుద్రకోటలో ఏసురత్నం, ఇసాక్ అనే ఇద్దరు చిన్నారులకు విముక్తి లభించింది. ఈ సందర్భంగా ఎన్‌డీసీఆర్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయరాజ్, డివిజన్ ఇన్‌చార్జి గగనకుమారి మాట్లాడతూ నెల్లూరు 4వ మైలులో కాపురం ఉంటూ చిత్తు కాగితాలు ఏరుకుని జీవనాన్ని సాగిస్తున్న అబ్రహాము, ఏసేబుల పిల్లలు బాల కార్మికులుగా ఉంటున్నారని చెప్పారు. మండలంలోని రుద్రకోటలో నివాసం ఉంటున్న పొండెయ్య ఇద్దరు పిల్లలను తమ తల్లిదండ్రుల నుంచి నెల జీతానికి కుదుర్చుకున్నాడని తెలిపారు. బాతులు మేపుకునే పనిలో భాగంగా నెలకు రూ.2 వేలు చొప్పున పిల్లల తల్లిదండ్రులకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పిల్లలను శనివారం గుర్తించిన తాము రూరల్ పోలీసుల సాయంతో గ్రామస్తులతో మాట్లాడామన్నారు. పిల్లలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అల్లూరు మండలం గొల్లపాళెం చైల్డ్ ఆశ్రమపాఠశాల నిర్వాహకులు శరత్‌కు అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అబ్దుల్ అలీమ్, గూడూరు డివిజన్ ఇన్‌చార్జి నరేంద్ర బాబు, నాయుడుపేట ఇన్‌చార్జి చంద్రశేఖర్, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.