
బాల్య వివాహాలు చేయొద్దు ∙
► కలెక్టర్ రొనాల్డ్‌రోస్
►పల్లమర్రిలో బాలికల తల్లిదండ్రులకు అవగాహన
చిన్నచింతకుంట: బాల్య వివాహాలు చేయరాదని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సూచించారు. ఎవరైనా చేయడానికి యత్నిస్తే చట్టరీత్యా నేరమన్నారు. మండల కేంద్రంలోని పల్లమర్రిలో బాలికలకు వివాహం చేయాలనుకున్న తల్లిదండ్రులకు బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. మండల కేంద్రంలోని పల్లమర్రిలో పదో తరగతి చదువుతున్న ఎరుకలి రాములు, ఎరుకలి చంద్రమ్మ కూతురు పెంటమ్మ (16), అదే గ్రామానికి చెందిన ఎరుకలి రాంచంద్రి, ఎరుకలి పోషమ్మ కూతురు మౌనిక (16)కు వివాహన చేయాలని నిశ్చయం చేసుకున్నారు.
ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ భీమయ్య ఆ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే వారి తీరు మారలేదని కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దాంతో బుధవారం కలెక్టర్‌కు పల్లమర్రికి చేరుకున్నారు. పెంటమ్మ, మౌనిక తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. బాల్య వివాహం చేస్తే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాలికలకు వివాహం చేస్తే గర్భిణి సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టర్ వివరించారు. ఒక్కోసారి చనిపోయే ప్రమాదముందన్నారు.
విద్యార్థులతో మాటామంతి అనంతరం బాలికలు పెంటమ్మ, మౌనికతో కలెక్టర్ మాట్లాడారు. మీకు చదువుకోవాలని ఉందా అని ప్రశ్నించారు. మంచి విద్యను అందిస్తామని చెప్పడంతో మాకు చదువుపై ఆసక్తి లేదని, చదువుకోలేమని చెప్పారు. వారి తల్లిదండ్రులు కూడా అదేరీతిలో మేం వలసజీవులం, చదివించలేమని సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 107సెక్షన్ల ద్వారా బాలికల తల్లిదండ్రులపై బైండోవర్ కేసు నోమదు చేసి రూ.లక్ష జరిమాన విధించాలని తహసీల్దార్ అఖిలప్రసన్న, ఏఎస్‌ఐ భీమయ్యను ఆదేశించారు.
చదువుకుంటాం.. సారూ..
ఆ తర్వాత ఆ బాలికలు చదువుకుంటాం సారు అని కలెక్టర్‌ను వేడుకున్నారు. దాంతో జిల్లా రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యను అందించాలని కలెక్టర్ సూచించారు. అలాగే మిగతా ఇద్దరు రాధ, కృష్ణవేణిని దేవరకద్ర రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించాలని ఎంఈఓ లక్ష్మణ్ సింగ్‌ను ఆదేశించారు. అనంతరం ఆ బాలికలు మంచిగా చదువుకుంటేనే మీ తల్లితండ్రులకు లక్ష జరిమాన, బైండోవర్ కేసును విరమింపచేస్తామన్నారు.
వలసలు వెళ్లకుండా జీవనోపాధి
అనంతరం రాంచంద్రి, పోషమ్మకు మహిళా సమాఖ్య ద్వారా రూ.50 వేలతో పాడిపశువులను ఇప్పించి వలసలకు వెళ్లకుండా చూడాలని ఏపీఎం తిరుపతి రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ జకియా సుల్తానా, ఆర్‌డబ్ల్యూఎస్ రఘు, పీఆర్ ఏఈ భరత్, అంగన్ వాడీ సూపర్‌వైజర్ సునీత, గ్రామపంచాయతీ కార్యదర్శి సుచిత్ర, ఏపీఓ నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.