మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీనృసింహం
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: కలెక్టర్
Published Thu, Jul 28 2016 1:22 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఎచ్చెర్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పీజీ, ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్, గ్రూప్స్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన అవసరమన్నారు. క్రమ శిక్షణ, పట్టుదల, లక్ష్యం, విషయ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు సివిల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య మట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు సివిల్స్ వంటి అత్యున్నత సర్వీసులకు ఎంపిక అవుతున్నారని, పేద విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు, ఐటీడీఏ పీవో వెంకటరావు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు పాల్గొని మాట్లాడారు.
Advertisement