సివిల్ ఇంజినీర్ ఇంట్లో చోరీ
కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయంలో ఘటన
10.5 తులాల బంగారు నగల అపహరణ
రంగంలోకి దిగిన పోలీసుల
గుంతకల్లు టౌన్: గుంతకల్లు పట్టణంలోని హనుమేష్‌నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ వెనుకభాగంలో సివిల్ ఇంజినీర్ నూర్ అహ్మద్ ఇంట్లో చోరీ జరిగింది. పదిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నూర్ అహమ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న వైజాగ్‌లోని డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటి తాళాన్ని పక్కనే ఉన్న సమీప బంధువుకి ఇచ్చివెళ్లారు. సోమవారం సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అల్మారా (గూటి)లో ఉంచిన తాళం చెవితో బీరువాను తెరిచి.. అందులోని సీక్రెట్ లాకర్‌లో భద్రపరిచిన బంగారు నగలను అపహరించారు. రాత్రి 7 గంటల సమయంలో ఈ ఇంటిలో బల్బు వెలుగుతుండటాన్ని గమనించిన నూర్ అహ్మద్ సమీప బంధువులు అక్కడికి వచ్చారు. అప్పటికే తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోనికెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే సమాచారాన్ని నూర్‌అహ్మద్‌కు చేరవేశారు. ఆయన వైజాగ్ నుంచి హుటాహుటిన బయల్దేరి మంగళవారం ఉదయం గుంతకల్లుకి చేరుకున్నారు. ఇంట్లో పరిశీలించిన తర్వాత 10.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ప్రసాదరావు, ఒన్‌టౌన్ ఎస్‌ఐ బీవీ.నగేష్‌బాబు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం నుంచి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు.