
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
చేవెళ్ల: మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో శనివారం మట్టి వినాయక ప్రతిమలను డీఎస్పీ శృతకీర్తి ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక యువకులు ఈ మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..పర్యావరణ కాలుష్య నివారణకు మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్టించాలని చెప్పారు. ఎంత పెద్ద, ఎన్ని రంగుల వినాయకులను ప్రతిష్టించామన్నది కాదు..ఎంత భక్తితో పూజచేశామన్నదే ముఖ్యమన్నారు. మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని యువతకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక విగ్రహాల మండపాలు, ప్రతిమల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు భీంకుమార్, విజయభాస్కర్, వరప్రసాద్, ఏఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.