-
రామాలయ విధుల నుంచి ఇద్దరు ప్రధాన అర్చకుల తొలగింపు
-
భద్రాద్రి చరిత్రలో ఇదే తొలిసారి
-
నగల మాయంపై విచారణకు సిద్ధమైన అధికారులు
-
విచారణ అధికారిగా డీఈ రవీందర్
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నగలు మాయమై..ఆ తర్వాత ప్రత్యక్షమైన వ్యవహారంలో దేవస్థానం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈఓ రమేష్‌బాబు ఇద్దరు ప్రధానార్చకులను రామాలయ విధుల నుంచి తప్పించారు. భద్రాద్రి రామాలయంలోని గర్భగుడి బీరువాలో ఉన్న బంగారు నగలు గత నెల 19న మాయమైన విషయం విదితమే. 10 రోజుల తర్వాత యథాస్థానంలో ప్రత్యక్షమైనప్పటికీ ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెలరోజులు దాటినా దోషులెవరో తేలకపోవడం..అర్చకుల నడుమ వాగ్వాదాలు...ఆపై దోషులెవరో తేల్చమంటూ అర్చకులే ముందుకు రావడంతో దేవాదాయ శాఖాధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.స్వామి వారి నిత్యకల్యాణోత్సవంలో వినియోగించే బంగారు నగలు తరచు మాయమవుతుండటం, ఆ తర్వాత ప్రత్యక్షమవ్వడం ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, దీనికి ఇద్దరు ప్రధాన అర్చకులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడమే దీనికి కారణమని ఈఓ నిర్ధారణకు వచ్చారు. అర్చకులపై సరైన అజమాయిషీ లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం వల్లనే ఇదంతా జరిగిందని, దీనికి ఆ ఇద్దరిని బాధ్యులను చేస్తూ ప్రధాన ఆలయ విధులు నుంచి ఈఓ తొలగించారు. పొడిచేటి జగన్నాథాచార్యులను తాతగుడి సెంటర్‌లో ఉన్న గోవిందరాజస్వామి వారి ఆలయానికి, పొడిచేటి సీతారామానుజాచార్యులను గోదావరి నదికి వెళ్లే దారిలో ఉన్న నర్సింహస్వామి వారి ఆలయానికి బదిలీ చేశారు. ఇలా చేయడం భద్రాచలం ఆలయ చరిత్రలోనే ప్రథమం. ఆ రెండు ఉపాలయాలలో పనిచేస్తున్న అర్చకులను ఉప ప్రధానార్చకులైన విజయరాఘవన్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆలయంలో స్వామి వారి పూజా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా అర్చకులకు విధులు కేటాయించే బాధ్యతను ఉప ప్రధానార్చకులకు అప్పగించారు.
విచారణ అధికారిగా రవీందర్
నగలు మాయం..తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని దేవస్థానంలోని ఇంజనీరింగ్ శాఖ డీఈ రవీందర్‌కు సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నగల మాయం, ఆ తర్వాత ఎలా ప్రత్యక్షమయ్యాయి, అర్చకుల మధ్య జరుగుతున్న వివాదాలు వంటి అంశాలపై డీఈ విచారణ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
ప్రక్షాళన దిశగా....
బంగారు ఆభరణాలు మాయం కావడం అందులో సీతమ్మ వారి పుస్తెలతాడు ఉండటంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. నగల మాయం కేసు పూర్వాపరాలపై ‘సాక్షి’ దినపత్రికలో విశ్లేషణాత్మకమైన కథనాలు సైతం వెలువడ్డాయి. దీంతో మేల్కొన్న దేవాదాయ శాఖాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తాన్ని స్థానభ్రంశం చేయగా అర్చకులకు సైతం రోటేషన్ పద్ధతుల్లో విధులు కేటాయించారు. తాజాగా ఇద్దరు ప్రధానార్చకులను ప్రధాన ఆలయంలో విధులు లేకుండా బదిలీ చేశారు. ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఆలయ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పూర్తి ప్రక్షాళన చేయడం మంచిదేనని భక్తులు అంటున్నారు. అయితే నగల మాయం వ్యవహారంలో విచారణ పక్కదారి పట్టకుండా పారదర్శకంగా జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
ఆలయ ప్రతిష్టే ముఖ్యం: దేవస్థానం ఈఓ రమేష్‌బాబు
భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని దేవస్థానం ఈఓ రమేష్‌బాబు అన్నారు. ప్రధానార్చకుల వైఫల్యం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. నగల మాయం, వివాదాలకు కారకులైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగిందని శాఖాపరంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే మరోసారి విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.