సాక్షి, సిటీబ్యూరో: ‘సార్...ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా ప్రతిభ ఏంటో నిరూపిస్తాం’ అంటున్నారు పలువురు ఇన్‌స్పెక్టర్లు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగైతే రెజ్యూమ్‌లు సమర్పిస్తారో.. అచ్చం అలాగే పలువురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్‌హెచ్‌ఓ బాధ్యతల కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
అవినాశ్ మహంతి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఠాణాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేలుస్తూ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనరేట్‌లోని ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి.
సమర్ధత, నిబద్ధతలకే ప్రాధాన్యం..
గతంలో ఇన్‌స్పెక్టర్లు ఎస్‌హెచ్‌ఓ పోస్టు పొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు సమర్పిస్తే తప్ప.. పోస్టింగ్ వచ్చేంది కాదు. హై ప్రొఫైల్ పీఎస్ అయితే డిమాండ్ మారీ ఎక్కువగా ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు.
సిఫారసు లేఖలతో వస్తే పోస్టింగ్ సంగతి దేవుడెరుగు.. కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త పోలీసు బాస్‌ల రాకతో ప్రతిభ, సమర్ధత, విశ్వసనీయత, నిబద్ధతలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఠాణాలకే కాకుండా ప్రధాన నగరంలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు సైతం కొత్త వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడమే ఇందుకు ఉదాహరణ.
ఈ ఠాణాలకు తొలిసారిగా ఎస్‌హెచ్‌ఓలు..
ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం ఒక్కసారి కూడా ఎస్‌హెచ్‌ఓగా పోస్టింగ్ పొందని వారు చాలా మందే ఉన్నారు. పీఎస్‌లో రెండవ ప్రాధాన్య పోస్టు అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గానో, క్రైమ్ వింగ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఐటీ ఇతరత్రా విభాగాలలో ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితులలో వీరందరిలో ఆశలు చిగురించాయి.
ఇప్పటివరకు 40–50 మంది ఇన్‌స్పెక్టర్లు ఎస్‌హెచ్‌ఓ పోస్టింగ్ కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే మాదాపూర్, మెకిలా, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, దుండిగల్, శంషాబాద్, జీడిమెట్ల ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓ పోస్టింగ్ పొందిన ఇన్‌స్పెక్టర్లు తొలిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నియమితులైనవాళ్లే.
అలాగే ఆర్‌జీఐఏ, ఇతర కొన్ని పీఎస్‌లలో రెండవ సారి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నియమితులయ్యారు. త్వరలోనే గచ్చిబౌలి , రాయదుర్గం, నార్సింగి వంటి హైప్రొఫైల్ ఠాణాలకు సైతం కొత్త అధికారులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment