
ప్రశాంతంగా పండుగల నిర్వహణ
కడప కల్చరల్ :
సెప్టెంబరులో రానున్న వినాయక చవితి, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా జరుపుకొందామని కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, అనధికారులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహసీల్దార్లు, ఆర్డీఓలు మండల, డివిజన్ స్థాయిల్లో ఉత్సవ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా పండుగలను నిర్వహించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలపాలన్నారు. ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఎక్కడ పెడుతున్నారో సంబంధిత పోలీసుస్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బక్రీద్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రతలు, వివిధ అంశాలను ఎమ్మెల్యే అంజద్‌బాషా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ సంరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తయారు చేసిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశానికి కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, పెద్దదర్గా ప్రతినిధులు నయీమ్, శాంతి కమిటీ సభ్యులు, జేసీ శ్వేత తెవతీయ, డీఆర్వో సులోచన, ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్‌పిళ్లై, టీడీపీ నాయకులు సుభాన్‌బాషా, వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.