ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ సాక్షిగా చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఇప్పటి వరకు కేంద్రానికి పంపించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ సాక్షిగా చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఇప్పటి వరకు కేంద్రానికి పంపించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దానిని మోదీ ప్రభుత్వానికి పంపించకుండా అసెంబ్లీ పెట్టెల్లో దాచి పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం మొత్తం ఏపీ ప్రజలను ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. మోదీ ఎక్కడ కేసులు పెడతారో అని భయపడి కేవలం ఢిల్లీకి పోయి రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తుందని వారు చెప్పిన మరుక్షణమే అరుణ్ జైట్లీ వంటి మంత్రులు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తున్నారని, దీనిని బట్టి చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.