'వర్సిటీలు పవిత్రమైనవి.. చెడ్డపేరొస్తే దిద్దుకోండి'
విజయవాడ: విశ్వవిద్యాలయాలు నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రూపొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. సోమవారం సీఎంఓలో ఏపీ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్లలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే స్నాతకోత్సవాలు గర్వించేలా రూపొందించాలని సూచించారు. భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విధంగా, అత్యుత్తమ కెరీర్ ఎంచుకునేందుకు స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. యూనివర్శిటీలు పవిత్రమైన ప్రాంగణాలని, గతంలో ఎక్కడైనా ఒకచోట చెడ్డపేరు వచ్చి ఉంటే దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు, వినూత్న ఆలోచనలకు కేంద్రాలుగా విలసిల్లాలని ఆకాంక్షించారు.
అవి విద్యార్థుల్లో జ్ఞాన తృష్ణ పెంచాలన్నారు. నదుల అనుసంధాన కార్యక్రమం, జలసంరక్షణలాంటి అంశాల్లో చర్చావేదికలు, కార్యశాలలు నిర్వహించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలివ్వాలని వీసీలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాలు నిర్మాణాత్మక పద్ధతులలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా ఉండాలన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా వైస్ ఛాన్సలర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
విశ్వవిద్యాలయాల అభివృద్ధికే పారిశ్రామికవేత్తలను విశ్వవిద్యాలయాల సెనెట్లలో సభ్యులుగా నియమించామని, యూనివర్శిటీలో విద్యార్ధులకు నైపుణ్యాభివృద్ధిలో సహకరిస్తారన్న అభిప్రాయంతోనే వారికి అవకాశం కల్పించామని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా (నాలెడ్జి హబ్‌గా)తీర్చిదిద్దాలన్న తన ఆశయసాఫల్యానికి వైస్‌ఛాన్సలర్లు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. సమావేశంలో సీఎంఓ ముఖ్యకార్యదర్శి శ్రీ సతీష్‌చంద్ర, సహాయకార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.