
'సీఎం, అటవీశాఖ మంత్రికి తెలియదు'
విజయవాడ : బాక్సైట్ జీవో జారీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని... అయితే వాటిని సవరించుకుంటామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి సమావేశానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
అరుకులోని బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ జీవో జారీ చేసింది. దీనిని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆందోళనకు కూడా సమాయత్తమైంది. ఆ క్రమంలో బాక్సైట్ జీవో జారీపై అధికార పక్షంలోని వారు సైతం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని సోమవారం విజయవాడలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.