సీఎం దండయాత్ర బలాదూర్
Published Fri, Oct 21 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
సోదర, సోదరీ దోమణుల్లారా...
హస్తిమశకాంతరమంటూ ఎగతాళి చేస్తుంటారు...ఏనుగును చూపించి మనల్ని చులకనగా చూస్తుంటారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది. భీకర యుద్ధాల్లో పనిచేసే గజరాజుల కన్నా మనమే నిజరాజులమని ఆచరణలో నిరూపించాం కదా. ఘీంకార హోరుకన్నా జుం...మనే ఝూంకార నాద ప్రభంజనానికి అల్లాడిపోతున్నారు జనం. ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదానం ప్రాంతం వరకు, ఊరూ...వాడల్లో ఎక్కడ చూసినా మన చిరునామాయే... ఎవరి నోట విన్నా మన నామ స్మరణమే. కాదంటారా కామ్రేడ్స్....మనపైనే యుద్ధం చేస్తారట...!
దండయాత్ర అనగానే కాకలు దీరిన మహారాజులు, చక్రవర్తుల పేర్లు విన్నాం. వారంతా మరో రాజ్యంపై యుద్ధాలు చేసి జైత్ర యాత్ర చేశారు. మరిదేమిటీ రాష్ట్ర ప్రభుత్వం దండయాత్ర అంటోంది. అదీ మనపైన...మొదట్లో పిల్ల దోమలు తెగ భయపడ్డాయి. అవి కూడా ముందరి కాళ్లను పైకెత్తి వ్వె...వ్వె అంటూ వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎం నారా వారే దండయాత్రలో భాగంగా సమర శంఖం పూరిస్తారట. నేడే జిల్లాకు విచ్చేస్తున్నారు. వాళ్ల బలహీనతలే మనం బలంగా మార్చుకుందాం. ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు మీకు తెలియనివి కావు. అయినా మరోసారి మననం చేసుకుందాం. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలున్నాయి...వీటినే 779 క్లస్టర్లగా విభజించారు...మనల్ని చంపించడానికి అంతమంది గ్రామ కార్యదర్శులను నియమించాలి...వారికి బ్లీచింగ్ పౌడర్, గంబూషియా చేపలు అందజేయాలి. ఇవేవీ మంజూరు చేసిన దాఖలాలు లేవు. చెత్తను, మురుగును తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి. 2,600 మందికి మించి కార్మికులు లేరు. ఇక మనం కాటేసిన ఫలితానికి జ్వరమొస్తే వైద్యం చేసే వైద్యులే లేరాయే. ఆసుపత్రుల్లో ఆ పోస్టులన్నీ ఖాళీలే. ఏజెన్సీలో కాళ్లవాపుతో వరుస మరణాలు సంభవిస్తున్నా లోగుట్టు తెలుసుకోక ఇటు అధికారులు ...అటు వైద్య నిపుణులు జుత్తు పీక్కుంటున్నారు. రక్త పరీక్షలు చేసినా పట్టుపడనంత పకడ్బందీగా రోగాలను విస్తరించే తెలివితేటలు మనకే సొంతం. ఏజెన్సీ ప్రాంతంలో 186 పంచాయతీల్లో మనదే రాజ్యం. పోటీ ప్రభుత్వాన్ని నడుపూతూ మనం విసురుతున్న సవాళ్లకు గింగిర్లు తిరిగిపోతున్నారు పరి‘పాలకులు’. నిధులు ఇవ్వకుండా ...యుద్ధ సామగ్రి లేకుండా గాలిలో కత్తులు తిప్పుతూ జనాన్ని మభ్య పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీడతో యుద్ధం చేస్తున్నారు. పక్కనున్న రాష్ట్రం జలాలు అడ్డంగా తరలించుకుపోతున్నా అడగలేకపోతున్నారు ... ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రశ్నించలేకపోతున్నారు .. ‘మాకూ ఏసీబీ ఉంది ... పోలీసులున్నారు ...ఖబడ్దార్’ అంటూ ఢంకా బజాయించి తోక జాడించి రాజీ పడిన చరిత్ర వారిది ... మనకు రాజీలుండవు .. అంతా రాజమార్గమే. చల్...చల్‌రా భాయ్...
Advertisement
Advertisement