ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం ఘటనపై సీఎండీ ఆరా!
తాడికొండ రూరల్ (గుంటూరు): తాడికొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ప్రమాదానికి గురై కాలిపోయిన 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఘటనను పరిశీలించేందుకు ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ గురువారం విచ్చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక కారణాల వలనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేలా చర్యలలో భాగంగా బాపట్ల, పర్చూరు, నరసరావుపేట సబ్‌స్టేషన్‌ల నుంచి లోడ్‌లు తీసుకోనున్నట్టు అధికారులు సీఎండీకి వివరించారు. నాలుగు రోజుల్లో ప్రమాదానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి ఆ స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సుబ్రహ్మణ్యం, చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్స్ కె.రాజబాపయ్య, అపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, పలువురు ఏఈలు అధికారులు పాల్గొన్నారు.
మరో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆయిల్ లీకేజీ
సబ్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగసిపడడంతో పక్కన ఉన్న మరో 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కూడా ఆయిల్ లీకవుతున్నట్లు అధికారులు గుర్తించి మరమ్మతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ బాగా మరిగి ఉండటంతో ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి. ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గితే కానీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించే అవకాశం లేకపోవడంతో మరో రోజు వేచి చూసిన అనంతరం తొలగింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.