కామవరపుకోట: సహకార సంఘాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వివాదాల్లో కూరుకుపోతున్నాయి. సొసైటీల వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కామవరపుకోట: సహకార సంఘాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వివాదాల్లో కూరుకుపోతున్నాయి. సొసైటీల వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 258 సహకార సంఘాలు, 31 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇవి ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో పనిచేస్తాయి. 258 సొసైటీలను 31 డీసీసీబీ బ్రాంచీలకు కేటాయించారు. ఈ బ్రాంచ్‌లు తమ పరిధిలోని సొసైటీలకు ఫైనాన్సింగ్ బ్యాంకులుగా వ్యవహరిస్తాయి. సొసైటీలు సక్రమంగా పనిచేసేందుకు ఫైనాన్సింగ్ బ్యాంక్ తరఫున బ్రాంచ్ మేనేజర్, సూపర్‌వైజర్ ప్రభుత్వం తరఫున సహకార శాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ విభాగం ప్రతినిధులు పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితే కొందరు అధికారులు పైరవీలు, రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి సొసైటీల్లో జరిగే అవినీతి, అక్రమాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వివాదాల్లో కొన్ని..
జిల్లాలో ఒకప్పుడు మంచిపేరున్న తిరుమలాపురం, ద్వారకాతిరుమల సొసైటీలు పూర్వ వైభవాన్ని కోల్పో యి క్లిష్ట పరిస్థితుల్లో ఉండటానికి ఫైనాన్సింగ్ బ్యాంక్, సహకార శాఖాధికారుల నిర్లిప్తతే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తిరుమలాపురం సొసైటీలో కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడని దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. కామవరపుకోట బ్రాంచి పరిధిలోని టి.నరసాపురం మండలం కె.జగ్గవరం సొసైటీలో సుమారు రూ.కోటి వరకు దుర్వినియోగమయితే కేవలం కార్యదర్శిని మాత్రమే బాధ్యుడ్ని చేయడం, కామవరపుకోట సొసైటీలో దుర్వినియోగం కాని సొమ్మును రూ.1.14 కోట్లను దుర్వినియోగం అయినట్టు చూపించి పాలకవర్గాన్ని రద్దు చేయడం అధికారుల ద్వంద వైఖరికి, రాజకీయ ప్రలోభాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సహకార సంఘాల్లో బైలా నిబంధనకు మించి నగదు నిల్వలను నిర్వహిస్తుంటే ఆ సంఘాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరిని తెలియజేస్తున్నాయి.