కొబ్బరికాయ @ రూ.2.50
భారీగా పడిపోయిన ధరలు
లబోదిబోమంటున్న రైతులు
కృత్తివెన్ను : కొబ్బరికాయ కంటే కోడిగుడ్డే అధిక ధర పలుకుతుంది. గుడ్డు విలువ రెండు కొబ్బరి కాయల ధరకు సమానంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొబ్బరి కాయ ధర భారీగా పడిపోయింది. రెండు నెలలుగా కొబ్బరి ధరలు రోజురోజుకూ తగ్గుతూ ప్రస్తుతం ముదురు కొబ్బరి కాయ రూ. రెండు నుంచి 2.50 పైసలకు చేరింది.
మార్కెట్‌లో రూ. 5లు చేస్తున్న కోడిగుడ్డుతో పోల్చుకుని కొబ్బరి రైతులు లబోదిబో మంటున్నారు. కొబ్బరి బొండాల ధర కూడా అదే స్థాయికి దిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కొన్ని నెలలు క్రితం కొబ్బరికి ఎనలేని డిమాండ్ ఉంది. టెంకాయ పది రూపాయలు పైచిలుకు పలుకగా నేడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
తగ్గిన కొబ్బరి బొండాల ఎగుమతులు
కోస్తా కోనసీమగా పేరుగాంచిన కృత్తివెన్ను మండలంలో చినగొల్లపాలెం దీవిలో కొబ్బరిని ప్రధాన పంటగా నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పంటపొలాలు, చేపల చెరువుల గ ట్లపైన పెద్ద ఎత్తున కొబ్బరి చెట్ల పెంపకం సాగుతోంది. గతంలో ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల వరకు కొబ్బరి బొండాలు మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్‌లతో పాటు హైదరాబాద్‌కు ఎగుమతి అయ్యేవి.
ప్రస్తుతం దిగుబడి ఉన్నా కొనగోలుదారులు లేకపోవడంతో వారానికి కనీసం 20 వేల కాయలు కూడా ఎగుమతి కావడం లేదు. బెంగుళూరు, తమిళనాడులతో పాటు రావులపాలెం ఈతకోట నుంచి నాణ్యమైన కొబ్బరి కాయలు దిగుమతి కూడా ఇక్కడి కాయలు కొనుగోలుపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముదురు కాయలకు కూడా సరైన ధరలేక రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది.