ఆలయ ఉద్యోగులంతా పంచె కట్టాల్సిందే..
భద్రాచలం: రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసే దిశగా దేవాదాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 6ఏ, బీ, సీ, డీ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో ఇక నుంచి విధిగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలని దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు వేద పండితులు, వైదికసిబ్బంది, అర్చక స్వాము లు, ఉద్యోగులంతా తప్పనిసరిగా ప్రవర్తనా నియమావళిని పాటించాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేదపండితుల నియమావళి
► వేద పండితులంతా ఆలయాల్లో తప్పనిసరిగా ప్రతి రోజూ 6 గంటలకు తక్కువ కాకుండా వేదపారాయణం చేయాలి.
► స్వామివార్లు, అమ్మవార్లకు జరిగే మేలుకొలుపు, అభిషేక కార్యక్రమాలకు హాజరుకావాలి.
► శిష్టాచార సంపన్నంగా కట్టు, బొట్టు, శిఖ, యజ్ఞోపవీతాదులతో యథావైదిక శాస్త్ర సంపన్నమైన వేష భాషలు కలిగి ఉండాలి.
► సాయంత్రం వేళల్లో జరిగే తిరువీధి సేవ, పల్లకీ సేవ, పవళింపు సేవల్లో ఆలయ అర్చకులతో పాటు వేద పండితులు కూడా పాల్గొనాలి.
► మద్యం, మాంసం, ధూమపానాలకు దూరం గా ఉండాలి. అనుబంధిత వేద పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు రోజూ పాఠాలు చెప్పాలి.
వైదిక/అర్చక స్వాములకు..
► శిష్టాచార సంపన్నముగా కట్టు, బొట్టు, శిఖ యజ్ఞోపవీతాదులతో యథాశాస్త్ర సంపన్నమైన వేషభాషలు కలిగి ఉండాలి.
► అశాస్త్రీయ, అనాగరిక మాటలు నిషిద్ధం.
► ఆలయంలో కానీ, ఆలయం బయట కానీ సిగరెట్లు, మద్యపానం, గుట్కా, జర్దాలు తినరాదు.
ఈవో, సిబ్బందికి నియమావళి..
► ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు సిబ్బంది అంతా పనివేళలల్లో తప్పనిసరిగా తెల్లని పంచెకట్టు, చొక్కా ధరించాలి (ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాంట్ ధరించరాదు). తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి.
► ధర్మకర్తలతోనూ, అర్చకాదులతోనూ, భక్తులతోనూ అత్యంత మర్యాద పూర్వకంగా మెలగాలి. ఆలయంలోకి భక్తులు ప్రవేశించగానే బొట్టు పెట్టుకునేందుకు వీలుగా కుంకుమ, శ్రీచూర్ణం, సింధూరం, విభూది వంటివి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి.
► ప్రతి ఆలయంలో ప్రతి రోజూ జరిగే వివిధ సేవల వివరాలను భక్తులకు తెలిసేలా ముందుగా ప్రచారం చేయాలి. ఆ రోజు తిథి, వార నక్షత్రాదులు వివరాలు ఆలయ ప్రదర్శన పట్టికలో ప్రతీ రోజూ రాయించాలి.
► వేదపండితులు, అర్చకులు, వైదిక సిబ్బంది, ఉద్యోగులు ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ వినియోగించరాదు.