–జిల్లాలో చిల్లరకు గిరాకీ
–రోజుకు రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు
– కృత్రిమ కొరత సృష్టిస్తున్న కమీషన్ వ్యాపారులు
– నూటికి రూ.10 నుంచి రూ.12 కమీషన్ వసూలు
శ్రీకాకుళం: జిల్లాలో చిల్లర కొరత నెలకొంది. ఇదే అదునుగా భావించిన కమీషన్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రోజూ ‘చిల్లర’ వ్యాపారం చేస్తూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. చిన్నచిన్న వర్తకుల నుంచి హోటళ్లు, మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారస్తులతోపాటు ఆటో డ్రైవర్లకు వారి వ్యాపారం బట్టి రోజుకు రూ.400 నుంచి రూ.1000 వరకు చిల్లర అవసరం అవుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యాపారులు కమీషన్ పద్ధతిన చిల్లర సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారంలో ఎక్కువమంది బడా వ్యాపారులే ఉండడం గమనార్హం.
రోజుకు రూ.1.5 కోట్ల మేర చిల్లర వ్యాపారం
జిల్లాలో ప్రతిరోజు రూ.1.5 కోట్ల వరకు చిల్లర నాణేలు అవసరమవుతున్నాయి. ఈ మేరకే చిల్ల వ్యాపారం కూడా జరుగుతోంది. నాణేలు అవసరం కావడంతో పలువురు వ్యాపారులు రూ.10 నుంచి రూ.12 వరకు కమీషన్ ఇచ్చి చిల్లరను కొనుగోలు చే స్తున్నారు. ఇటువంటి కమీషన్‌దారులు కొట్టు కొట్టుకూ వచ్చి చిల్లరను సరఫరా చేస్తున్నారంటే వ్యాపారం ఏ మేరన ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిల్లర కొరత వల్ల అనేక సందర్భాల్లో వినియోగదారులు, వ్యాపారులు ఒకటి రెండు రూపాయలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు రూ.8 నుంచి రూ.10 వరకు ఉన్న కమీషన్ డిమాండ్‌ను బట్టి మరో రూ.2 నుంచి రూ.4 పెరిగింది. ఒక వ్యాపారి ప్రస్తుతం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు చిల్లరను కమీషన్‌పై ఇస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలం నుంచి చిల్లరకు కొరత ఉంది. అప్పట్లో చిల్లరకు బదులుగా చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు. మరికొద్ది కాలం చిల్లరకు బదులుగా టోకెన్లు ఇచ్చేవారు. దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో వ్యాపారులు చిల్లర కొనుగోలు చేయాల్సి వస్తోంది.
మార్కెట్లలో ఎక్కువ అవసరం
జిల్లాలోని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలతోపాటు మేజర్ పంచాయతీల్లోని మార్కెట్లలో చిల్లర వినియోగం ఎక్కువగా ఉంటోంది. వీటిలో సుమారుగా 20 వేల మందికిపైగా వ్యాపారస్తులు లావాదేవీలను నిర్వహిస్తుంటారు. వీరు ఒక్కొక్కరు ప్రతి రోజూ రూ. 500 నుంచి రూ.800 వరకు చిల్లరను వినియోగిస్తుంటారని అంచనా. వీరితోపాటు చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, బస్సు కండక్టర్లు రోజుకు రూ. 200 నుంచి రూ. 300 వరకు నాణేలను సమకూర్చుకోకుంటే వ్యాపారం సవ్యంగా జరగని పరిస్థితి. ఇటీవల కాలంలో రేషన్ దుకాణాల్లో సైతం చిల్లర అవసరమవుతోంది. దీని వల్లనే కమీషన్ వ్యాపారం ప్రారంభమైంది.
రూ.15 లక్షలకు పైగా కమీషన్
చిల్లర వ్యాపారాన్ని కమీషన్ల పద్ధతిన చేస్తున్నవారు రోజుకు రూ.15లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో శ్రీకాకుళం పట్టణంతోపాటు పలాస, పాలకొండ, టెక్కలి, నరసన్నపేట, ఇచ్ఛాపురం, రాజాంలలో చిల్లర వ్యాపారం చేసేవారు ప్రత్యేకంగా దుకాణాలు తెరిచారంటే వ్యాపారం ఏ మేరన ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరితోపాటు కొందరు జనరల్, కిల్లీ షాపులు, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారస్తులు చిల్లర వ్యాపారాన్ని తమకు అనుకూలంగా మలచుకొని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
అనేక మార్గాల్లో చిల్లర సేకరణ
కమీషన్ పద్ధతిపై చిల్లరను ఇస్తున్నవారు నాణేలను అనేక పద్ధతుల్లో సమకూర్చుకుంటున్నారు. దేవాలయాల హుండీలను లెక్కించే సమయాల్లో అక్కడి అధికారులను, కమిటీ సభ్యులను మచ్చిక చేసుకొని నాణేలను సేకరిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల నుంచి, యాచన సాగించే వారినుంచి తక్కువ కమీషన్‌పై నాణేలను తీసుకొని వాటిని తిరిగి ఎక్కువ కమీషన్‌కు సరఫరా చేస్తున్నారు. స్టేట్ బ్యాంకులో కరెంటు ఖాతాలు, పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపే వ్యాపారులకు చిల్లర నాణేలను ఇస్తుండడంతో వారంతా నిత్యం ఎస్‌బీఐ నుంచి చిల్లరను తెచ్చి కమీషన్ వ్యాపారులకు ఇస్తున్నారు. మరికొందరు నేరుగా కమీషన్ పద్ధతిపై వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. అధికారులు ఇటువంటి చిల్లర దోపిడీ వ్యాపారులపై దృష్టి సారించకుంటే మాఫియాగా మారే ప్రమాదం ఉందనడంలో అతిశయోక్తి లేదు.