
కలెక్షన్ కింగ్
♦ పురాతన నాణేలు, స్టాంపుల సేకరణ
♦ ప్రత్యేకత చాటుతున్న వాజేడు లైబ్రేరియన్
♦ కళాశాలలో ప్రదర్శన
వాజేడు: స్వాతంత్య్రం రాకపూర్వం చలామణిలో ఉన్న నాణేలు, పురాతన స్టాంపులు చూడాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఏ మ్యూజి యంకో వెళ్లాలి. కానీ, మ్యూజియం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాడు వాజేడు ప్రభుత్వ జూని యర్ కాలేజీ లైబ్రేరియన్ నవీన్. పురాతన నాణేల నుంచి, ఆధునిక నాణేల వరకు, దేశ, విదేశీ కరెన్సీ, దేశంలో ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించాడు. వాటిని ఏ కాలంలో వినియోగించేవారో ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నాడు. అణా పైసల నుంచి రూ.10 వరకు నాణేలనూ ప్రదర్శిస్తున్నాడు. వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అలపర్ల నవీన్ స్వస్థలం భద్రాచలం. అతడి తండ్రి వీజే పీటర్ పాతతరం రూపాయి నాణేన్ని దాచాడు.
నవీన్ చిన్నతనంలో ఉన్నప్పుడు పీటర్ అలా చేయడాన్ని గమనించాడు. అప్పటి నుంచి నవీన్ కూడా ప్రాచీన నాణేలు సేకరించి భద్రపర్చడం నేర్చుకున్నాడు. 9వ తరగతి చదువు తున్నప్పటి (1993) నుంచి పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, పలు సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సేకరించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. స్వాతంత్య్రం రాక ముందు చలామణిలో ఉన్న 17 పురాతన నాణేలను సేకరించారు. ఒక్కపైసా నుంచి రూ.10 వరకు నాణేలను సేకరించారు. వాడుకలో ఉన్న పలు ఏడాదుల్లో వచ్చిన భారతదేశ కరెన్సీ రూ.1 నోటు నుంచి రూ.1000 నోటు వరకు సేకరించి భద్రపర్చారు. అమెరికా, ఈజిప్ట్, కతార్, ఒమన్, యూఏఈ, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, అరేబియా, శ్రీలంక, ఇథియోపియా, కెన్యా, బ్రెజిల్, ఫిలిప్పైన్స్, బహ్రెయిన్‌తోపాటు మొత్తం 20 దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన అనంతరం విడుదలైన మొదటి స్టాంపు, మహాత్మాగాంధీ మృతి అనంతరం ఆయన ఫొటోతో విడుదలైన మొదటి స్టాంపు, 1993 నుంచి 2016 వరకు విడుదలైన మినీ ఏజర్ సీట్స్ (నాలుగు, ఐదు స్టాంపులు కలిసి ఉన్న సీట్)లను 134 సేకరించారు. రూ.25 వేలు ఖర్చు చేసి వాటన్నింటినీ కళాశాలలో ప్రదర్శిస్తున్నారు. వాటి ప్రత్యేకతను నవీన్ వివరిస్తున్నారు.