
విద్యార్థినులను పరామర్శిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి
♦ ఇంటర్ విద్యార్థినులపై దూసుకెళ్లిన టిప్పర్
♦ ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
♦ ఓర్వకల్లు వద్ద ఘటన
♦ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఉదయం తొమ్మిదిన్నర అవుతోంది. మరికొద్ది సేపట్లో కాలేజీ మొదలవుతుంది. దీంతో విద్యార్థినులంతా చకచకా నడుచుకుంటూ కాలేజీకి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. ఇంతలోనే టిప్పర్ రూపంలో మృత్యుశకటం దూసుకొచ్చింది. ఓ విద్యార్థినిని మాంసపు ముద్దలా మార్చేసింది. మరో ఏడుగురిని గాయపరిచింది. ఈ ఘటన మంగళవారం ఓర్వకల్లులో చోటుచేసుకుంది.
ఓర్వకల్లు:
ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 160 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆర్‌సీ ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. వీరు ప్రతిరోజూ ఆటోలు, బస్సుల్లో ఓర్వకల్లు బస్టాండుకు చేరుకుని.. అక్కడి నుంచి జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ కళాశాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం శకునాల గ్రామానికి చెందిన మహాలక్ష్మి, నిర్మల, శోభారాణి, మాధవి, హుశేనాపురం గ్రామానికి చెందిన శాంతకుమారి, మమత, కాల్వ గ్రామానికి చెందిన సుస్మిత, ఓర్వకల్లుకు చెందిన పరిమళ స్థానిక బస్టాండు వద్ద నుంచి రోడ్డు వెంట నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరారు. మరో రెండు నిమిషాలలో కళాశాలకు చేరుకుంటారు. అయితే.. ఈలోపే వెనుక వైపు నుంచి టిప్పర్ వేగంగా వచ్చి వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హుశేనాపురానికి చెందిన శాంతకుమారి(16) అక్కడికక్కడే చనిపోయింది. మిగతా ఏడుగురు గాయపడ్డారు.
అదే సమయంలో రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో శకునాలకు చెందిన మహాలక్ష్మి(16) పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణంరెడ్డి, అధ్యాపకులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వద్ద ఉన్న సెల్ నంబర్ల ఆధారంగా బాధిత పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని బోరున విలపించారు. శాంతకుమారి మృతదేహం మాంసం ముద్దలా ఉండడంతో అది చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శాంతకుమారి తండ్రి సోమన్న మరణించారు. తల్లి నీలమ్మ బధిరురాలు (మూగ–చెవిటి). దీంతో ఆమె అవ్వ వద్ద ఉంటూ చదువుకునేది.
బోల్తా పడిన టిప్పర్
ప్రమాదానికి కారణమైన టిప్పర్ రోడ్డు పక్కనగల ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొని 20 అడుగుల దూరంలో బోల్తా పడింది. కాగా.. ఇది మండలంలోని వెంకటాపురం వద్దనున్న శ్రీలక్ష్మీ రోడ్డు మెటల్ కంపెనీకి చెందినది. ఈ కంకర కంపెనీని కర్నూలు మాధవనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి, బనగానపల్లెకు చెందిన మరో నలుగురు భాగస్వాములు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ సిమెంటు కంకర మిశ్రమాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రమాదానికి కారణమైంది. పరిస్థితిని గమనించిన టిప్పర్ డ్రైవర్ గోవిందు వాహనం అద్దాలను పగులగొట్టుకుని పరారయ్యాడు. అందులో లభించిన మద్యం సీసాను బట్టి అతను మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఇన్‌చార్జ్ సీఐ మహేశ్వరరెడ్డి పరిశీలించారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
ప్రమాద విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పాణ్యం బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కర్నూలు ఆర్డీఓ హుసేసాహెబ్, తహసీల్దార్ శ్రీనాథ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ, టీడీపీ మండల కన్వీనర్లు లక్ష్మీకాంతరెడ్డి, గోవిందరెడ్డి ,గ్రామ సర్పంచు పెద్దయ్య తదితరులు బాధితులను పరామర్శించారు. ఓర్వకల్లు రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి అన్నారు. ఇకమీదట పునరావృతం కాకుండా చూడాలన్నారు.
గాయపడ్డ విద్యార్థినులకు మెరుగైన వైద్యం : కలెక్టర్
కర్నూలు(హాస్పిటల్): ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. కర్నూలు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి అనే విద్యార్థిని పరిస్థితి ఆందోళనగా ఉందని, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారన్నారు. వీరందరికీ మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.