పనులపై సమీక్షిస్తున్న కలెక్టరు లక్ష్మీనరసింహం
ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం
Published Sat, Sep 10 2016 12:05 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
శ్రీకాకుళం టౌన్ :
–మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో ఎంతో ఆర్భాటంగా గోతులు తవ్వాం. వాటిని పూడ్చడానికి ఇంత వరకు అతీగతిలేదు. చెల్లింపులు లేకే అవి పూడ్చకుండా వదిలేసి కాగితాలపై లెక్కలేసుకుంటున్నాం..ఇదీ ఇంకుడు గుంతల పరిస్థితి.
–జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు లక్షల మొక్కలు నాటేస్తామని చెప్పుకున్నాం. మాటలు నమ్మి మంత్రులు వచ్చి ఆ మొక్కలు నాటి లక్షల్లో మొక్కలు నాటేశామని చెప్పుకున్నారు. వాస్తవానికి ఇంతవరకు మొక్కలు నర్సరీల్లోనే ఉన్నాయి. కడియం నుంచి వచ్చే మొక్కలపై కాకిలెక్కలు చెబుతున్నారు.
–వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి. ఈ నెల 25న కేంద్ర బృందం ఓడీఎఫ్ గ్రామాల పరిశీలనకు వస్తుంది. అప్పటికైనా ఇవి పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి.
–ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలరోజులు గడిచిపోయింది. ఫారం పాండ్స్ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి ఉంటే రైతుల పొలాల్లో నీరు నిల్వ ఉండేది. సాగుకు తగినంత నీటిని వినియోగించుకునేందుకు వీలు లేకుండా చేశారు.
–గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు ఇంకుడు గుంతలు కప్పే బాధ్యతలు అప్పగించండి. వారు చేయకపోతే సర్పంచ్, కార్యదర్శి, లబ్ధిదారుని సహాయంతో వాటిని పూర్తి చేయండి.. అంటూ కలెక్టరు పి.లక్ష్మీనరసింహం ఎంపీడీవోలు, నీటి యాజమాన్య సంస్థ ఏపీవోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులతో మండలాల వారీగా మంజూరు, లక్ష్యాలు, చెల్లింపులు తదితర అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు. ముందుగా ఓడీఎఫ్ గ్రామాలను శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమం వర్షాకాలం తర్వాత చేపడితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పథకం అమలులో వెనుకబడడానికి గల కారణాలు వెతికి త్వరితగతిన పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు రోణంకి కూర్మనాథ్, పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ మోహనమురళి, డీఎఫ్‌వో శాంతిస్వరూప్, సామాజిక అటవీ శాఖాధికారి లోహితాస్యుడు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఎంపీవోలు, ఈసీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement