70% తగ్గితే చర్యలు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఇంటి పన్నులపై ఈఓపీఆర్‌డీలు,కార్యదర్శులతో సమీక్ష
వరంగల్ రూరల్ : జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఈ ఏడాది 70శాతం కన్నా తక్కువ పన్నులు వసూలైన గ్రామపంచాయతీల బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్ను బకాయిలు, వసూళ్లపై హన్మకొండలోని జెడ్పీ హాల్‌లో సోమవారం ఆయన ఈఓ పీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మండలాల వారీగా గ్రామాల్లో పన్నుల లక్ష్యం వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పన్నుల వసూళ్లలో వెనకబడి ఉన్న గ్రామాల ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజువారీ లక్ష్యాలు
ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 24 రోజులే గడువు ఉన్నందున రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని గ్రామాలకు వెళ్లాలని కలెక్టర్ పాటిల్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించాలని మందలించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో కొన్ని మండలాలు ముందంజలో ఉన్నాయని, మిగతా వారు కూడా ప్రత్యేక దృష్టి సారించాలరు. ప్రతీరోజూ ఉదయమే గ్రామాలకు వెళ్లి పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నల్లబెల్లి, గీసుగొండ మండలాల్లో దాదాపు 90శాతం లక్ష్యాన్ని చేరుకోవడంపై ఆయన అధికారులను అభినందించారు. ఈఓ పీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు సమష్టిగా పనిచేస్తే ఫలితముంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పిండి కుమారస్వామి, గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) ఈఈ విజయ్‌గోపాల్ పాల్గొన్నారు.