లక్ష్యాలను నెరవేర్చండి : కలెక్టర్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రభుత్వం నిర్దేశించిన పలు అభివృద్ధి పనుల లక్ష్యాలను నెరవేర్చాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని ఎంపీడీఓలను కలెక్టర్ ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక దర్గామిట్ట జెడ్పీ కార్యాలయ సమావేశ మం దిరంలో ఆత్మగౌరవం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకార్యక్రమాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇంతవరకు కొన్ని మండలాల్లో రెండంకెల స్థాయిలో సైతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, బిల్లుల విషయంలో జాప్యం జరగదని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో రాత్రి బసచేయాలన్నారు. గ్రామస్థాయిలో, ఎస్సీ, ఎస్టీ కాలనీ ల్లో విషజ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. విషజ్వరాల నివారణపై 24వ తేదీన ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా విషజ్వరాలను గుర్తించినట్లయితే కాల్‌సెంటర్ 1800 425 2499కు సమాచారం అందించాలన్నారు. జైడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్‌ఓ వరసుందరం పాల్గొన్నారు.