పనులు చేయకుంటే ఇంటికే
-
కలెక్టర్ ముత్యాలరాజు
కావలిఅర్బన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా చేయని సిబ్బందిని ఇంటికి పంపిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పంట సంజీవని, జియోట్యాగింగ్, ఫాంపాండ్స్, మొక్కల పెంపకం, జాబ్‌కార్డులు, మేట్ గ్రూపులు, సిబ్బందికి ఇచ్చిన టార్గెట్లు, పనిచేస్తున్న కూలీలు, డిమాండ్లు, ఎస్టిమేషన్లు, పూర్తైన పనులు, కూలీలు పనులకు రాకపోవడానికి గల కారణాలు వంటి పలు అంశాలపై చర్చించారు. విధి నిర్వహణలోని పనుల్లో పురోగతి చూపని బోగోలు మండలానికి చెందిన ముగ్గురు, దగదర్తి మండలానికి చెందిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సమీక్షా సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. డ్వామా పీడీ హరిత మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి ఇచ్చిన టార్కెట్లు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన టార్గెట్లు త్వరగా చేపడతామని సమాధానం ఇచ్చిన సిబ్బందిని ఇంతకాలం పూర్తిచేయని పనులు ఇప్పుడు ఎలా చేయగలదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనులు చేపట్టి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ ప్రసాద్‌రావు, కావలి, జలదంకి, కొండాపురం, అల్లూరు, బోగోలు మండలాల ఎంపీడీఓలు లింగారెడ్డి జ్యోతి, రవీంద్ర, ఖాజాబీ, కనకదుర్గా భవాని, వెంకట శేషయ్య, దగదిర్తి ఈఓపీఆర్డీ వెంకటేశ్వర్లు, కావలి ఏపీఓ శ్యామల, ఆయా మండాలల ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈసీలు, సీనియర్, జూనియర్ మేట్లు, సిబ్బంది పాల్గొన్నారు.