పల్స్ సర్వే తీరుపై కలెక్టర్ సీరియస్
-
పనిచేయని ఎన్యూమరేటర్లను తొలగించాలని ఆదేశం
-
మండలస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజల జీవన స్థితి గతులు, కుటుంబ సమగ్ర వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే జిల్లాలో కొనసాగుతున్న తీరు, తెన్నులపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో ఆయన మాట్లాడారు. సర్వే ప్రారంభించి 18 రోజులైనప్పటికీ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల పరిధిలో ఒకట్రెండు ఇళ్లకు మించి సర్వే చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేటర్లు సక్రమంగా పని చేయకుంటే తొలగించాలని ఆదేశించారు. సర్వే కార్యక్రమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. ఈ నెల 29న జిల్లాలో 11.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో కృష్ణా పుష్కరాల పనులు జరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో కె.నాగబాబు, జిల్లా అటవీ శాఖాధికారి పి.రామ్మోహన్, జెడ్పీ సీఈవో సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.