దేవుని భూముల్లో చేపల చెరువులా?
దేవుని భూముల్లో చేపల చెరువులా?
Published Thu, Aug 10 2017 12:29 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అవి నిబంధనలకు విరుద్ధం
వెంటనే ధ్వంసం చేయండి
మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఏలూరు (మెట్రో):
దేవుని భూముల్లో చేపల పెంపకమా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా అటువంటి చేపల చెరువులను, రొయ్యల చెరువులను ధ్వంసం చేసి తీరాల్సిందేనని కలెక్టర్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆకివీడు జగన్నాథస్వామి దేవస్ధానానికి చెందిన వ్యవసాయ భూముల్లో చెరువులు తవ్వి చేపలు పెంచుతున్నారని డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమానికి గతంలో ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించి చెరువులను ధ్వంసం చేయడానికి వెళితే గ్రామస్ధులు అడ్డుపడ్డారని మత్స్యశాఖ ఆకివీడు ఎఫ్‌డీఓ వివరించారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ దేవుని మాన్యంలో చేపల పెంపకానికి మొదట్లోనే అనుమతించకుండా ఉంటే ఈనాడు ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఎవరి భూములైనా నిబంధనలకు విరుద్దంగా చేపలు, రొయ్యలు పెంచితే ధ్వంసం చేసి తీరాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లాలో ఆక్వా జోన్స్ ఏర్పాటుపై రాష్ట్ర మత్స్యశాఖ తగు చర్యలు తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, రేపు విజయవాడలో జరిగే రాష్ట్ర స్ధాయి మత్స్యశాఖాధికారుల సమావేశంలో విషయాన్ని ప్రస్తావించాలని మత్స్యశాఖ జేడీ అంజలిని ఆదేశించారు. కొల్లేరులోని ఐదవ కాంటూరు లోపు ఎక్కడా కూడా చేపల సాగు లేదని వన్యప్రాణి సంరక్షణాధికారి సాయిబాబా చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ జేడీ ఎస్.అంజలి, వ్యవసాయ శాఖ జేడీ గౌసియాబేగం, గ్రౌండ్ వాటర్ డీడీ ఎన్.రంగారావు, ఇరిగేషన్ శెట్టిపేట ఈఈ శ్రీనివాస్, జిల్లాలోని ఎఫ్‌డీఓలు పాల్గొన్నారు.
పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటులో ఎకరానికి రూ. 5 వేలు లంచం ఇవ్వనిదే క్షేత్రాలకు అనుమతి ఇవ్వడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టరు పశుసంవర్దక శాఖ జేడీని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వ్యవసాయం, పశుసంవర్ధక, బిందు సేద్యం వంటి ప్రాధాన్యతా రంగ శాఖల పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో 4,580 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు అంచనాలు తయారు చేసి ఆమోదం తెలపాల్సిన పశుసంవర్ధక శాఖ ఇప్పటి వరకు 767 పనులకు మాత్రమే అంచనాలు రూపొందించడం వెనుక అవినీతికి ఆస్కారం కనబడుతోందని కలెక్టరు అన్నారు. అదే విధంగా మినీ రైతు బజార్ల ఏర్పాటు వంటి అంశాలపై కలెక్టరు సమీక్షించారు.
పారిశ్రామికాభివృద్ధికి ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అవసరమైన చేయూతనందిస్తామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజ వనరులున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్దలాలను కేటాయించి ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.
Advertisement