ఇష్టం లేకపోతే ఇంటికెళ్లండి | collector shwetha mahanthi intolarance on revenue department | Sakshi
Sakshi News home page

ఇష్టం లేకపోతే ఇంటికెళ్లండి

Published Fri, Sep 22 2017 9:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ శ్వేతామహంతి - Sakshi

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ శ్వేతామహంతి

రికార్డులు ఇష్టమొచ్చినట్లు రాస్తారా?
‘భూప్రక్షాళన’ తీరుపై కలెక్టర్‌ అసహనం
మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని
అధికారులకు ఆదేశాలు జారీ

ఖిల్లాఘనపురం : రెవెన్యూ రికార్డులను ఇష్టమొచ్చినట్లు రాస్తే ఎలాగని రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లండి..’అంటూ అసహనం వ్యక్తంచేశారు. సమస్యలు ఉన్న సర్వే నంబర్ల వివరాలు, సమస్యలను గుర్తించి ప్రత్యేకంగా ఓ రికార్డులో పొందుపర్చమని చెప్పామని, ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గురువారం ఆమె మండలం ఉప్పరిపల్లి, అప్పారెడ్డిపల్లి గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను ప్రత్యేకంగా పరిశీలించారు.

గ్రామాల్లో ఆరురోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, రికార్డులను తీసుకుని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆమె కార్యాలయంలో ఉన్న ఆర్‌ఓఆర్, కాస్రాపహాణి, ఓల్డ్‌ ఆర్‌ఓఆర్, చెసాల, చేత్వార్‌లో ఉన్న భూములకు అధికారులు ప్రత్యేకంగా రాసిన రికార్డుల్లోని భూముల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రికార్డును మరోసారి పరిశీలించాలని డిప్యూటీ తహసీల్దార్‌ సునితను కోరారు. అనంతరం అప్పారెడ్డిపల్లికి వెళ్లిన కలెక్టర్‌ రికార్డుల నమోదు ప్రక్రియను చూసి అసహనం వ్యక్తంచేశారు.
 
మరుగదొడ్ల ఫొటోలు అప్‌లోడ్‌ చేయండి
ఉప్పరిపల్లిలో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రాలేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఎంపీడీఓ రెడ్డయ్య, ఏపీఓ సురేష్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహిమూద్‌ను పిలిచి విచారించారు. ఫొటోలు అప్‌లోడ్‌ చేయకపోవడంతోనే బిల్లులు ఆలస్యమైనట్లు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను కలెక్టర్‌ హెచ్చరించారు.

బతుకమ్మ చీరలు పంపిణీ
మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గురువారం కలెక్టర్‌ శ్వేతామహంతి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, శ్రీనువాసులు, శంకర్‌గౌడ్, శ్రీనువాసాచారి, కృష్ణయ్య, విష్ణు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement