కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేలు.. | Collector vs. MLAs .. | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేలు..

Published Sat, Dec 17 2016 2:54 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేలు.. - Sakshi

కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేలు..

ముదురుతున్న లొల్లి గతంలో జడ్పీ సమావేశంలో వెలుగులోకి.. తాజాగా కలెక్టర్ల సదస్సులో మరోమారు.. ఒత్తిళ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్‌ ? సీడీపీ నిధుల వినియోగంపై  నిఘాతో ప్రజాప్రతినిధుల గుర్రు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

నిజామాబాద్‌ : జిల్లా కలెక్టర్‌ యోగితారాణా., జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోందా..? పాలనా పరమైన విషయాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పెరుగుతున్నాయా..? తాజా పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగిన విషయం విదితమే. ఈ సమావేశంలో కలెక్టర్‌ యోగితారాణా తనపై పలు అంశాల్లో రాజకీయ ఒత్తిళ్లున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం జిల్లా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తే జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యోగితారాణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో ఎమ్మెల్యేల సీడీపీ నిధులతో చేపట్టిన పనులపై నిఘా పెట్టారు. కొన్ని అడ్డగోలు పనులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ చేయించారు.

ఆయా ఎమ్మెల్యేలు తన నిధులతో ప్రతిపాదించిన పనులు నాణ్యతగా జరుగుతున్నాయా.? నామమాత్రంగా పనులు చేసి.,  బిల్లులు డ్రా చేస్తున్నారా..? అంశంపై కలెక్టర్‌ విచారణ చేయించారు. ఇది పలువురు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం మింగుడు పడలేదు. తమ నిధులపై కలెక్టర్‌ నిఘా పెట్టడాన్ని తట్టుకోలేని ఎమ్మెల్యేలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ యోగితారాణాపై మండిపడ్డారు. తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో కలెక్టర్‌ ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. స్వయంగా మంజీర నదిలో ఇసుక క్వారీలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఈ తరుణంలో కూడా కలెక్టర్‌పై ఒత్తిళ్లు వచ్చాయనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. తాజాగా తనపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని కలెక్టర్‌ స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది.

కాగా నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో కమీషన్‌ ఏజెంట్ల అడ్డగోలు దోపిడీకి చెక్‌పెట్టేందుకు కలెక్టర్‌ డైరెక్ట్‌ పర్జేస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్‌ యార్డులో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. తమ అడ్డగోలు దందాకు చెక్‌పడటం మింగుడుపడని కొందరు వ్యాపారులు ఏకంగా సమ్మెకు దిగారు. సుమారు పది రోజులు కొనుగోళ్లు నిలిపేశారు. ఈ కేంద్రాన్ని నీరుగార్చే దిశగా కలెక్టర్‌పై నేతలతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement