
రంగు చూసి కొంటే రోగాలే
- నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగబెడుతున్న వ్యాపారులు
- పట్టించుకోని అధికారులు
- ఇలాంటి పండ్లను తింటే అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు
చూసేందుకు చక్కగా ఉంటాయి. సువాసననూ వెదజల్లుతూ నోరూరించేస్తాయి. అలాగని ఏవి పడితే అవి తిన్నామో అసలుకే ఎసరొస్తుంది. ఇదంతా చెబుతోంది మామిడిపళ్ల గురించే. కాల్షియం కార్బైడ్ గుళికలతో మాగబెట్టిన మామిడి పళ్లను కొందరు వ్యాపారులు స్వలాభం కోసం యథేచ్ఛగా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు.
అనంతపురం అగ్రికల్చర్ : మళ్లీ మామిడి పళ్ల సీజన్ వచ్చేసింది. కలర్‌ఫుల్‌గా కనిపించే పండ్లను జనం కూడా బాగానే కొనేస్తున్నారు. అయితే కొనేముందు, తినే ముందు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మంది వ్యాపారులు నిషేధిత కాల్షియం కార్బైడ్ అనే రసాయన గుళికలు వేసి మామిడి పళ్లను మాగబెట్టేస్తున్నారు. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మార్కెట్లోకి చైనా పౌడర్
ప్రభుత్వం జీఓ జారీ చేసినా, అధికారులు హెచ్చరికలు చేస్తున్నా వ్యాపారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. తోటల్లోనూ, రహస్య ప్రాంతాల్లో మామిడి పళ్లను కార్భైడ్‌తో మాగబెడుతున్నారు. కార్భైడ్‌పై నిఘా ఉండటంతో ఇటీవల చైనా నుంచి మరో రకం పౌడర్ అందుబాటులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇపుడు చాలామంది చైనా పౌడర్‌తో మామిడి పండ్లను మాగబెట్టి మార్కెట్‌లోకి వదులుతున్నట్లు సమాచారం.
అధికారుల మధ్య సమన్వయ లోపం
ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో యథేచ్చగా కార్భైడ్ పండ్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారులు సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం మాగబెట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 39 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉండగా అందులో కాపుకు వచ్చినవి 20 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇలా మాగబెడతారు
మండీలు, తోటల్లో కాయలను కుప్పగా పోసి రాళ్లు మాదిరిగా ఉండే కాల్షియం కార్బైడ్‌ను చిన్నపాటి గుళికలు చేసి చిన్న చిన్న పాలిథీన్ కవర్లలో పెట్టి పైన పేపర్లు, గడ్డి లాంటివి కప్పుతారు. కాల్షియం కార్బైడ్ వల్ల ప్రమాదకరమైన అసిటలీన్ అనే వాయువును విడుదలవుతుంది. పక్వానికి రాని మామిడికాయలను ఒక రోజులోనే మాగేటట్లు చేస్తుంది. అసిటలీన్ అనే వాయువు చాలా ప్రమాదకరమైంది. మాములుగా అసిటలీన్‌ను వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో కాల్షియం కార్బైడ్ అనే రసాయనం అతి తక్కువ ధరకు లభిస్తుంది. కాల్షియం కార్బైడ్ కాకుండా మరికొందరు క్రిమిసంహారక ముందులు కూడా పిచికారి చేస్తున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం
కాల్షియం కార్బైట్‌తో మాగబెట్టిన పండ్లను తింటే నోటి అల్సర్, గ్యాస్ట్రిక్, డయేరియా, క్యాన్సర్, నాడీ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేకమైన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ రంగుతో లభించే పండ్లను కొనకూడదనీ, పండ్ల పై భాగంలో రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్న తర్వాత ఉప్పు కలిపిన నీటితో బాగా శుభ్రం చేసి తినాలని చెబుతున్నారు. కార్బైడ్ పండ్లలో పోషకాలు కూడా ఉండవని వైద్యులు చెబుతున్నారు.
సహజ పద్ధతులే మేలు
వరిగడ్డి లేదా బోధగడ్డి లాంటి సహజ పద్ధతులతో పాటు రైపనింగ్ ఛాంబర్లలో మాగబెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు, ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పండ్లు మాగడానికి ‘ఇథలీన్’ వాయువు చాలా అవసరం. ఇథలీన్ వాయువు ఉత్పత్తి కావడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఒకటన్ను మాగబెట్టడానికి 1 మి.లీ ఇథరిల్ ద్రావణం, 1 గ్రాము సోడియం హైడ్రాక్సైడ్ అవసరమని చెబుతున్నారు. మార్కెట్‌యార్డులో భూమిపుత్ర రైపనింగ్ ఛాంబర్ (58వ షాపు) గత నాలుగేళ్ల నుంచి అందుబాటులో ఉన్నా మాగడం ఆలస్యమవుతుందని చాలా మంది వ్యాపారులు, రైతులు ఇటువైపు మొగ్గు చూపడం లేదు. అయితే ఇటీవల మార్కెట్‌యార్డులో కార్బైడ్ నివారణకు కొంత వరకు చర్యలు చేపట్టడంతో ఇప్పుడిప్పుడే రైపనింగ్ ఛాంబర్‌కు మామిడికాయలు రావడం ప్రారంభమయ్యాయి. రోజుకు ఐదారు టన్నుల మామిడిని మాగబెడుతున్నట్లు రైపనింగ్ ఛాంబర్ నిర్వాహకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి తెలిపారు.