త్వరలో టీటీ అకాడమీ | coming soon tt academy | Sakshi
Sakshi News home page

త్వరలో టీటీ అకాడమీ

Published Sat, Sep 3 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

త్వరలో టీటీ అకాడమీ

త్వరలో టీటీ అకాడమీ

ప్రైవేటు రంగంలో మూడు నెలల్లో ఏర్పాటు
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన
రూ.కోటిన్నర వ్యయం ఏపీ టీటీఏ అధ్యక్షుడుభాస్కరరామ్‌ వెల్లడి∙ ముగిసిన రాష్ట్ర స్థాయి ర్యాకింగ్‌ టీటీ పోటీలు
 
 
రాజమహేంద్రవరం సిటీ/ కోటగుమ్మం :
నగరం నుంచి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.భాస్కరరామ్‌ తెలిపారు. రూ.కోటి వ్యయంతో ప్రైవేటు రంగంలో మూడు నెలల్లో దీనిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్థానిక ఎస్‌వీ ఫంక్షన్‌ హాలులో మూడు రోజులపాటు జరిగిన రెండో రాష్ట్రస్థాయి ర్యాకింగ్‌ టీటీ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సభలో భాస్కరరామ్‌ మాట్లాడుతూ, అకాడమీ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా హామీ ఇచ్చిందన్నారు. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ టీటీ అకాడమీకి చీఫ్‌ రిఫరీ వేణుగోపాల్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అకాడమీలో సుమారు 12 టీటీ టేబుళ్లు ఏర్పాటు చేయనున్నామని, క్రీడాకారులు నిరంతరాయంగా శిక్షణ పొందేందుకు నిష్ణాతులైన కోచ్‌లను నియమిస్తామని భాస్కరరామ్‌ ప్రకటించారు. క్రీడాకారులకు నిరంతర శిక్షణ ఇచ్చేందుకు వీలుగా.. రాజమహేంద్రవరం, విశాఖ, పశ్చిమ గోదావరి టీటీ అసోసియేన్లకు రూ.3 లక్షల విలువైన ఆరు టీటీ టేబుళ్లను జిల్లాకు రెండు చొప్పున ఆయన అందజేశారు.
 
ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు రంకిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ, అకాడమీలు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి లో శిక్షణ ఇచ్చినప్పుడే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచినవారికి గోపాలకృష్ణతోపాటు డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపికైన శైలు నూర్‌బాషా, బంగి నాగశ్రావణిలకు రూ.10 వేల చొప్పున భాస్కరరామ్‌ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. టేబుల్‌ టెన్నిస్‌లో జాతీయ చాంపియన్‌గా ఎదిగిన రాజమహేంద్రవరానికి చెందిన ఆచంట ఉమేష్‌ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌ వీఆర్‌ ముక్కామల, చీఫ్‌ రిఫరీ వేణుగోపాల్, రిఫరీలు అర్జున్, చలపతి, రాజమహేంద్రవరం కోచ్‌ వీటీవీ సుబ్బారావు తదితరులను కూడా సత్కరించారు.
 
నంబర్‌–1గా కాజోల్‌ సునార్, జగదీష్‌ కృష్ణ
ఇప్పటివరకూ ఉన్న రాష్ట్రస్థాయి నంబర్‌–1 ర్యాంక్‌ను బాలికల విభాగంలో కాజోల్‌ సునార్‌(విజయవాడ), బాలుర విభాగంలో ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు) తిరిగి నిలబెట్టుకున్నారు. బాలికల విభాగం నుంచి సబ్‌ జూనియర్, జూనియర్, యూత్, మహిళ విభాగంలో కాజోల్‌ ప్రథమ స్థానంలో నిచిలింది. అలాగే బాలుర విభాగంలో జగదీష్‌కృష్ణ పురుషులు, యూత్‌ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా, ఆర్‌.సాయిస్వరూప్‌ (విజయవాడ) బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. యూత్, పురుషుల విభాగాల్లో ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీకి చెందిన కాజోల్‌ సునార్‌ నాలుగు విభాగాల్లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలవడంతో విజయవాడ క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. నాలుగు మెడల్స్‌ సాధించిన ఆనందంతో కోచ్‌ బి.శ్రీనివాసరావు, కాజోల్‌ సునార్‌ క్రీడాప్రాంగణాన్ని ముద్దాడారు.
 
వివిధ విభాగాల్లో విజేతలు వీరే..
కేడెట్‌ బాలికలు : టి.హాసిని(అనంతపురం)పై బుడ్డా శ్రేష్ట (అనంతపురం) విజయం సాధించింది.
కేడెట్‌ బాలుర విభాగం : ఎం.వెంకట కార్తికేయ(విజయవాడ)పై కృష్‌ జైన్‌ (విజయవాడ).
స»Œ  జూనియర్‌ బాలికలు : నజీరబాయ్‌ నూర్‌బాషా(విజయవాడ)పై ఆర్‌.కాజోల్‌ సునార్‌ (విజయవాడ).
సబ్‌ జూనియర్‌ బాలురు : ఆకాష్‌ వర్ధన్‌(విజయవాడ)పై టి.సూర్యతేజ (కాకినాడ).
జూనియర్‌ బాలికలు : శైలు నూర్‌బాషా(విజయవాడ)పై ఆర్‌.కాజోల్‌ సునార్‌ (విజయవాడ).
జూనియర్‌ బాలురు : జి.పవన్‌ తేజ(విశాఖపట్నం)పై ఆర్‌.సాయిస్వరూప్‌ (విజయవాడ).
యూత్‌ బాలికలు : బంగి నాగ శ్రావణి(అనంతపురం)పై ఆర్‌.కాజోల్‌ సునార్‌ (విజయవాడ).
యూత్‌ బాలురు : ఆర్‌.సాయిస్వరూప్‌(విజయవాడ)పై ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు).
మహిళలు : బంగి నాగశ్రావణి(అనంతపురం)పై ఆర్‌.కాజోల్‌ సునార్‌ (విజయవాడ).
పురుషులు : ఆర్‌.సాయిస్వరూప్‌(విజయవాడ)పై ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు).
 
దేశానికి పేరు తేవాలని ఉంది
దేశం తరఫున అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తాం. రాష్ట్రస్థాయి పోటీల్లో ఛాంపియన్లుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక మా కోచ్‌లు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. సెప్టెంబర్‌ 25 నుంచి 30 తేదీల మధ్య ఇండోర్‌లో ఆలిండియా పోటీలు, అక్టోబర్‌లో విశాఖపట్నం, నవంబర్‌లో ఆలిండియా ఈస్ట్‌ జోన్‌ పోటీల్లో పాల్గొంటున్నాం.
– ఆర్‌.కాజోల్‌ సునార్, ఆచంట జగదీష్‌కృష్ణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement