కమీషను దుకాణం!
కమీషను దుకాణం!
Published Sat, Jun 3 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
- పని ఏదయినా ఆయనకు ముట్టజెప్పుకోవాల్సిందే..
- మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు
- ఆలస్యం చేస్తే.. విజిలెన్స్ దాడులు
- స్వయంగా పురమాయిస్తున్న ఎమ్మెల్యే
- ఇప్పటికే ఒకరిపై విచారణ మొదలు
- ఇదేం పద్ధతి అంటూ కాంట్రాక్టర్ల గగ్గోలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీరు ఏదయినా కాంట్రాక్టు పని చేస్తున్నారా? అయితే, కచ్చితంగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేను కలవాలంటూ సంబంధిత అధికారి నుంచి సమాచారం వస్తుంది? ఆ వెంటనే కలిసి కమీషన్ మాట్లాడుకోవాల్సిందే! లేనిపక్షంలో గతంలో మీరు చేసిన పనులపై వెంటనే విచారణ చేయాలంటూ విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు పోవడం.. వెనువెంటనే విజిలెన్స్ విచారణ ప్రారంభం కావడం చకాచకా జరిగిపోతాయి. అధికార పార్టీలో చేరిన సదరు ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్న తీరుకు కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా బెదిరింపులకు దిగడం ఏమిటని వాపోతున్నారు. ఈ దందాకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గోడదూకిన సదరు ఎమ్మెల్యే వైఖరి వివాదాస్పదంగా మారింది. ఇంకా పూర్తిగా వర్క్ ఆర్డర్ కూడా చేతికి రాకూండానే ఎమ్మెల్యేను కలవండంటూ వర్తమానం రావడం కాంట్రాక్టర్లకు మింగుడుపడటం లేదు. కొన్ని పనుల్లో పెద్దగా మిగిలేది ఏమీ ఉండదని.. అప్పటికే తక్కువ ధరకు కోట్ చేసి పనులు దక్కించుకున్న తర్వాత ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తే పనులు నాసిరకంగా తప్ప నాణ్యతతో చేసే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఇలా ఓ కాంట్రాక్టర్ నాలుగు రోజులైనా ఎమ్మెల్యేను కలవకపోవడంతో విజిలెన్స్ అధికారులు సదరు కాంట్రాక్టర్ చేస్తున్న పనులపై విచారణ ప్రారంభించడం షురూ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులే మధ్యవర్తులు
జిల్లాలో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలే చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో చేస్తున్న కార్యక్రమాలే అధికం. అందులోనూ వస్తున్న కొద్దిపాటి నిధులపై ఈ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కమీషన్ల పర్వానికి తెరలేపడం విమర్శల పాలవుతోంది. ఉన్న కొద్దిపాటి పనులను దక్కించుకునేందుకు తక్కువ ధరలనే కోట్ చేయాల్సి వస్తోందనేది కాంట్రాక్టర్ల అభిప్రాయం. దీనికితోడు ఇప్పుడు కమీషన్ ఇస్తే పనుల నాణ్యత ఏ విధంగా ఉంటుందని వాపోతున్నారు. పని పూర్తయ్యే సందర్భంలో అంతో ఇంతో అధికార పార్టీ నేతలకు ఇవ్వడం పరిపాటేనని.. అయితే, కనీసం వర్క్ ఆర్డర్ చేతికి అందకముందే తనను కలిసి కమీషన్ మాట్లాడుకోవాలనడం గతంలో ఎన్నడూ చూడలేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీనికితోడు ఇప్పుడు సంబంధిత శాఖ అధికారులే ఎమ్మెల్యేను కలిసి రాకపోతే పని కూడా ప్రారంభించలేరని చెబుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని కొద్ది మంది కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
ఇదేం విచారణ...!
వాస్తవానికి నిర్దిష్టంగా ఏవైనా పనులపై ఫిర్యాదు వస్తే విజిలెన్స్ అధికారులు విచారణ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే, తాజాగా ఒక కాంట్రాక్టర్‌పై జరుగుతున్న విచారణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా మూడు రోజుల క్రితం ఎమ్మెల్యేను కలవాలంటూ ఒక అధికారి చెప్పడం.. కలవకపోవడంతో నాలుగో రోజే విజిలెన్స్ విచారణ ప్రారంభం కావడం యాధృచ్ఛికం మాత్రం కాదనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం మరో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేను వెళ్లి కలవాలని.. లేనిపక్షంలో విజిలెన్స్ విచారణ ప్రారంభమవుతుందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, విజిలెన్స్ అధికారులు మాత్రం సాధారణ విధుల్లో భాగంగానే విచారణ చేస్తున్నామని.. ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లేవీ లేవని పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement