పది పరీక్షల ఏర్పాట్లపై కమిషనర్ అసంతృప్తి
Published Sun, Mar 19 2017 12:00 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జిల్లాలోని మూడు స్కూళ్లను తనిఖీ చేశారు. గోనెగండ్ల, కోడుమూరు, లద్దగిరి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి.. లద్దగిరి కేంద్రంలో ఒకే బెంచీపై ముగ్గురు విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు ఒక బెంచీ చొప్పున ఏర్పాటు చేశారు. మరో కేంద్రంలో ఏకంగా కమిషనర్ ఎదుటే చీఫ్ సూపరింటెండెంట్ చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడంతో పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని చెప్పినా మీకు అర్థం కాలేదా అని ఆగ్రహించారు. అత్యవసరం అయితే కీప్యాడ్ సెల్‌తో ఆఫీస్ రూంలో కూర్చొని మాట్లాడాలని సూచించారు.
రెండవ రోజు 250 మంది గైర్హాజరు
పదవ తరగతి రెండో రోజు పరీక్షలకు మొత్తం 50,275 మంది విద్యార్థులకు గాను, 50,025 మంది హాజరుకాగా, 250 మంది గైర్హాజరయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కమిషనర్‌తో పాటు, డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 82 కేంద్రాలను తనిఖీ చేశారు.
Advertisement