‘వేగం’ పేరిట వసూళ్లు | commissions on speed maths books | Sakshi
Sakshi News home page

‘వేగం’ పేరిట వసూళ్లు

Published Sun, Oct 23 2016 10:39 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘వేగం’ పేరిట వసూళ్లు - Sakshi

‘వేగం’ పేరిట వసూళ్లు

– ఏడాదవుతున్నా సరఫరా కాని ‘స్పీడ్‌మ్యాథ్స్‌’ పుస్తకాలు
............................................................................
వేగంగా లెక్కలు చేయడం ఎలాగో స్పీడ్‌మ్యాథ్స్‌ పుస్తకాలతో తమ విద్యార్థులకు నేర్పిద్దామనుకున్న ప్రధానోపాధ్యాయులకు ఏడాదిగా ఎదురుచూపులే మిగిలాయి. వాటిని పంపిణీ చేస్తామంటూ ముందుకొచ్చిన సంస్థ ప్రతినిధులు డబ్బుల వసూళ్లలో చూపిన ‘వేగం’ ఆ పుస్తకాలు అందజేయడంలో చూపడం లేదు. సంవత్సరం కిందటే డబ్బులు కట్టినా కనీసం మోడల్‌గానైనా ఒక్క పుస్తకం కూడా అందజేయలేదు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఈ పోటీ ప్రపంచంలో వేగానికి ఎక్కడ లేని విలువా వచ్చేసింది. ఏ రంగంలోనైనా వేగం పేరు చెబితే చాలు జనాలు క్యూ కట్టేస్తున్నారు. చదువు విషయానికి వచ్చినా స్పీడ్‌మ్యాథ్స్‌తో లెక్కల్లో వేగం పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కష్టతరమైన అర్థమెటిక్స్, ఆల్‌జిబ్రా, జియోమెట్రి, ట్రిగొనోమెట్రి, రీజనింగ్‌ వంటి గణిత ప్రశ్నలకు స్పీడ్‌మ్యాథ్స్‌(వేద గణితం) పద్ధతుల ద్వారా సులభంగా జవాబులు తెలుసుకోవచ్చు. సాధారణ విద్యార్థికన్నా వేద గణిత విద్యార్థికి 30–40 శాతం వరకు జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. అందువల్ల స్పీడ్‌మ్యాథ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విశాఖపట్టణానికి చెందిన ‘కరుణ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌’ స్పీడ్‌ మ్యాథ్స్‌ పుస్తకాలు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. దీనికి దన్నుగా నిలిచిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో స్పీడ్‌మ్యాథ్స్‌ పుస్తకాలు సరఫరా చేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో సదరు సంస్థ జిల్లాలోని పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు స్పీడ్‌మ్యాథ్స్‌ బుక్కులు సరఫరా చేసేందుకు డబ్బులు వసూలు చేసింది.

కొనుగోలుకు డీఈఓ ఉత్తర్వులు
‘కరుణ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌’ ప్రతినిధులు గత ఏడాది సదరు మంత్రి ఆదేశాలతో వచ్చి డీఈఓ అంజయ్యను సంప్రదించారు. దీంతో ఆయన అందుబాటులో ఉన్న ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో సదరు సంస్థ ద్వారా స్పీడ్‌మ్యాథ్స్‌ బుక్కులు కొనుగోలు చేయాలంటూ ఉత్తర్వులు (ఆర్సీ నంబర్‌ 513 తేదీ 10–12–2015) ఇచ్చారు. ఒక్కో కిట్‌ రూ.1,200 ప్రకారం ప్రతి పాఠశాలా కనీసం రెండు కిట్లు  కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు ఈ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. సుమారు 50 శాతం మంది ప్రధానోపాధ్యాయులు డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఇలా సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆ సంస్థ వసూలు చేసినట్లు విద్యాశాఖాధికారుల అంచనా. ఆ పుస్తకాలు ఎలాగుంటాయో కూడా తెలీదంటున్న ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు కదా అని కొనుగోలుకు ముందుకొచ్చామని చెబుతున్నారు. ఇతర జిల్లాల్లో సరఫరా చేసిన పుస్తకాలను పరిశీలించిన వారు వాటి నాణ్యతపైనా పెదవి విరుస్తున్నారు. కనీసం పుస్తకాలు ఇలా ఉంటాయని కూడా చూపించకుండా డబ్బులు వసూలు చేయడం, దానికి అధికారులు వత్తాసు పలకడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. గతంలో నెఫ్జెల్‌ పథకం అమలు సమయంలో ఇలానే ఓ సంస్థ అధికారుల అండతో పాఠశాలలకు కుట్టుమిషన్లు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. ముందుగానే డబ్బులు వసూలు చేసిన ఆ సంస్థ నేటికీ చాలాచోట్ల కుట్టుమిషన్లు అందజేయలేదు. ఈ స్పీడ్‌మ్యాథ్స్‌ పుస్తకాల వ్యవహారం కూడా ఆ కోవలోకి వెళ్లిపోతుందేమోనని ప్రధానోపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
.................................................
సంస్థ ప్రతినిధులకు గట్టిగా చెప్పాం
విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు కావడంతో స్పీడ్‌మ్యాథ్స్‌ తీసుకోవాలని చెప్పాం. చాలామంది ప్రధానోపాధ్యాయులు డబ్బులు కట్టారు. కానీ ఇప్పటిదాకా పుస్తకాలు ఇవ్వలేదు. దీనిపై సంస్థ ప్రతినిధులకు చాలా సీరియస్‌గా చెప్పాం. మరికొన్ని జిల్లాలకు కూడా సరఫరా చేస్తుండటం వల్ల ఆలస్యమైందని వాళ్లు చెబుతున్నారు. త్వరలోనే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
– అంజయ్య, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement