జిల్లా ఎస్పీకి పిర్యాదుచేస్తున్న బాదితుని బందువులు
- డోన్ రూరల్ ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
- కొత్తకోట గ్రామంలో ఉద్రిక్తత
డోన్ టౌన్: ఆధిపత్యపోరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడాడు. ఈ ఘటన డోన్ మండలం కొత్తకోట గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన దళిత వాడ అధికారపార్టీకి చెందిన ఇద్దరి నాయకుల అధిపత్య పోరాటానికి వేదికైంది. దీంతో దళితులు రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో పరస్పరం దాడులకు పాల్పడడంతో కేసులు నమోదై కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక వర్గానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి పురుగుల మందు తాగడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యర్థి వర్గానికి చెందిన దస్తగిరి, పుల్లన్నల సమక్షంలో రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య చేయి చేసుకున్నాడనే మనస్థాపంతో రామాంజనేయులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నార. డోన్‌కు వచ్చిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు.. ఎస్పీ దృష్టికి తెచ్చారు.
రక్షణ కల్పించండి
కొత్తకోట గ్రామంలో అధికారపార్టీ నాయకుని దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఎస్‌ఐ అకారణంగా మా కుమారుడిపై ప్రత్యర్థుల ఎదుట చేయిచేసుకున్నాడు. ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు యత్నించాడు.
నాగలక్ష్మమ్మ, కొత్తకోట గ్రామం, డోన్
మందలించాను
రామాంజనేయులు, దస్తగిరిలు తరచుగా గొడవ పడుతున్నారు.గతంలో ఇరువురిపై కేసులు నమోదు చేశాం.అయినా తిరిగి గొడవకు దిగుతుంటే ఇరువురుని స్టేషన్‌కు పిలిపించి మందలించాం. అంతే తప్ప ఎవరిపై కూడా చేయి చేసుకోలేదు. ఆరోపణలు అవాస్తవం
- రామసుబ్బయ్య, ఎస్‌ఐ